ఆర్టీసీలో కొత్తగా 3,039 జాబ్స్ భర్తీ : పొన్నం ప్రభాకర్

  • టీజీపీఎస్సీ ద్వారా నియామకాలు 
  • వేములవాడ, ధర్మపురి, కొండగట్టుకు లింకు రోడ్లు
  • అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్​

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో కొత్తగా 3,039 ఉద్యోగాలను టీజీపీఎస్​సీ ద్వారా భర్తీ చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు వివేక్, ఆదిశ్రీనివాస్, పాల్వాయి హరీశ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. జిల్లా కేంద్రాలకు లింక్ రోడ్లు ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. 

దీంతో బస్సులకు డిమాండ్​ పెరిగిందన్నారు. కొత్త రూట్లను పెంచుతున్నామని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటు సమయంలో ఆర్టీసీలో 55వేల మంది ఉద్యోగులు ఉంటే.. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి 40వేల మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. 15 ఏండ్లు దాటిన బస్సును స్క్రాప్​కు పంపిస్తున్నామని.. కొత్త బస్సులు కొంటున్నామని చెప్పారు. గతంలో 50 శాతం ఆక్యుపెన్సీ ఉండేదనీ, నేడు 100శాతం దాటుతోందని చెప్పారు. 

వేములవాడ–ధర్మపురి–కొండగట్టు ఆలయాలను కలపుతూ బస్సుల లింకింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్లలకు బస్సులను పెంచుతామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఎరియర్స్ ఫండ్స్ రూ.280 కోట్లు చెల్లించామనీ, 21 శాతం పీఆర్సీ, కంపాసినేట్ అపాయింట్​మెంట్స్ చేస్తున్నామని తెలిపారు.

చెన్నూరు డిపో ఏర్పాటుకు టెండర్లు

చెన్నూరు బస్ డిపో ఏర్పాటుకు ప్రభుత్వం టెండర్లు పిలిచిందని మంత్రి పొన్నం చెప్పారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్​లో ఎమ్మెల్యే వివేక్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. చెన్నూరు డిపో కోసం రూ.4 కోట్లు మంజూరు అయ్యాయని చెప్పారు. మెదటి విడతగా కోటి 20లక్షలు చెల్లిచామని, కాంపౌండ్ వాల్, బేస్మెంట్, గ్యారేజీ పనులు పూర్తయ్యాయని తెలిపారు. కానీ ఆర్టీసీకి సంబంధించిన భూమిపై హూకోర్టులో స్టే ఉన్నందున పనులు నిలిచిపోయాయని చెప్పారు. కోర్టులో స్టే వెకేట్ అయిన వెంటనే డిపో ఏర్పాటు చేస్తామని వివరించారు.