చెరువులు నిండుతున్నయ్

  • ఒక మండలంలో అత్యధికం, 4 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు
  • పొంగి పొర్లుతున్న79 చెరువులు

మెదక్, వెలుగు: వానకాలం ప్రారంభం అయ్యాక దాదాపు రెండున్నర నెలల పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో చెరువులు క్రమంగా నిండుతున్నాయి. పెద్ద సాగునీటి ప్రాజెక్ట్​లు లేని జిల్లాలో రైతులకు పంటల సాగుకు చిన్ననీటి వనరులైన చెరువులే ఆధారం. దీంతో చెరువులు నిండుతుండడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 21 మండలాల పరిధిలో మొత్తం 2,238 చెరువులు ఉండగా ఈ వానాకాలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో చెరువుల్లో నీరు చేరలేదు. వాటికింద ఉన్న ఆయకట్టులో పంటల సాగుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తొలకరి వర్షాలు కురియగానే దుక్కులు దున్ని నారుమళ్లు పోసుకున్న రైతులు సకాలంలో సరైన వర్షాలు పడక పంటలు సాగు చేయలేకపోయారు. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలోని చెరువులు నీటి నిల్వను సంతరించుకుంటున్నాయి.  

వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 497 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 516 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మాసాయిపేట మండలంలో సాధారణం కంటే 90 శాతం అధికంగా వర్షం కురియగా, చేగుంట, నార్సింగి, చిన్న శంకరంపేట, మెదక్ మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురిసింది. ఒక్క నర్సాపూర్​ మండలంలో మినహా మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇటీవల కురిసిన వర్షాలకు 79 చెరువులు పూర్తిగా నిండి పొంగి పొర్లుతుండగా, 139 చెరువుల్లో 75 నుంచి 100 శాతం నీరు చేరింది, మరో 478 చెరువుల్లో 50 నుంచి 75 శాతం నీరు చేరింది. చెరువుల్లో నీరు చేరడంతో వాటి ఆయకట్టు పరిధిలో సాగు చేసిన పంటలకు మేలు చేకూరుతుందని రైతులు అభిప్రాయ పడుతున్నారు. అంతేగాక చెరువుల్లో నీరు చేరడంతో భూగర్భ జలాలు పెంపొందడంతో పాటు, చేపల పెంపకానికి అనువైన వాతావరణం నెలకొందని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

చెరువుల్లో నీటి నిల్వ ఇలా..

నీటి నిల్వ    చెరువుల
శాతం             సంఖ్య

0 - 25                825
25 - 50              717
50 - 75              478
75 -  100           139
సర్​ప్లస్​             79