ఢిల్లీ సీఎం బంగ్లాపై రాజకీయ దుమారం..శీష్​మహల్పై ఆప్, బీజేపీ నేతల ఆరోపణలు, సవాళ్లు

  • ఢిల్లీలో శీష్​మహల్​ రచ్చ
  • శీష్​ మహల్​ను కేజ్రీవాల్​ 40 కోట్లతో 7స్టార్ హోటల్​గా మార్చారని బీజేపీ ఆరోపణలు
  • మీడియాతో కలిసి శీష్​మహల్​కు ఆప్​ నేతలు
  • ఆరోపణలు నిరూపించాలని బీజేపీ నేతలకు సవాల్​
  • పోలీసులు అడ్డుకోవడంతో పీఎం నివాసం వద్ద నిరసన

న్యూ ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్​అయిన మరునాడే ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. ఆప్, బీజేపీ నేతల మధ్య నడుస్తున్న పరస్పర మాటల యుద్ధం కాస్తా ఆందోళనల దాకా వచ్చింది. ఈ సమయంలో సీఎం బంగ్లా వివాదం రాజకీయ దుమారాన్ని రేపుతున్నది. 

6 ఫ్లాగ్‌‌‌‌స్టాఫ్ రోడ్‌‌లోని బంగ్లాను అర్వింద్​ కేజ్రీవాల్​ సీఎంగా ఉన్నప్పుడు 40 కోట్లు ఖర్చు చేసి 7 స్టార్​హోటల్​గా మార్చేశారని, ఇది ‘శీష్​ మహల్’ అంటూ బీజేపీ చేసిన​కామెంట్లపై బుధవారం రచ్చ కొనసాగింది. బీజేపీ విమర్శలను ఆప్ తిప్పికొట్టింది. 

ప్రజలకు నిజాలను చూపుతామంటూ ఉదయం ఆ పార్టీ నేతలు సంజయ్​ సింగ్​, సౌరభ్​ భరద్వాజ్​ మీడియాను తీసుకొని  6 ఫ్లాగ్‌‌స్టాఫ్ రోడ్‌‌లోని బంగ్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. 

అయితే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఆప్‌‌ నేతలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వారు అక్కడ బైఠాయించి, నిరసన తెలిపారు.  సీఎం నివాసంలోకి వెళ్లేందుకు ఓ ఎంపీ, మంత్రికి ఎందుకు అనుమతి అవసరమని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సీఎం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.   

బీజేపీ అబద్ధాలు బయటపడ్డయ్: ఆప్​ నేతలు

శీష్​మహల్​లోకి మీడియాతో వెళ్లేందుకు అనుమతించకపోవడంతో బీజేపీ అబద్ధాలు బయటపడ్డాయని ఆప్ నేతలు సంజయ్ ​సింగ్​, సౌరభ్​ భరద్వాజ్​ అన్నారు. ‘‘సీఎం నివాసంలో గోల్డెన్​ టాయ్​లెట్, స్విమ్మింగ్​పూల్, మినీ బార్ ఉన్నాయని బీజేపీ లీడర్లు కొన్ని నెలలుగా ఆరోపణలు చేస్తున్నరు.

 రోజుకో వీడియోను విడుదల చేస్తున్నారు. ఇవాళ మీడియాతో ఇక్కడికి వచ్చాం. బీజేపీ నేతలను రావాలని కోరాం. వారి ఆరోపణలు నిజమని నిరూపించాలని సవాల్​ చేశాం. అయితే, పోలీసులు వాటర్ ​ఫిరంగులతో అడ్డుకున్నారు. 

లోనికి అనుమతిస్తే అసలు నిజాలు బయటపడేవి” అని పేర్కొన్నారు. తాము మీడియాతో వస్తే బీజేపీ నేతలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.  కాగా, ప్రధాని మోదీ అధికార నివాసం ‘రాజ్​మహల్’ అని ఆప్​ నేతలు విమర్శించారు. 

ఇందుకోసం రూ.2,700 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రధాని లగ్జరీ భవనంలోకి మీడియాను అనుమతించాలని బీజేపీకి సవాల్​ చేశారు. లోక్​కల్యాణ్​​మార్గ్​లోని ప్రధాని నివాసంవైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. 

అయితే, వారిని పోలీసులు అడ్డుకోగా, తుగ్లక్​రోడ్​లోని పోలీస్​స్టేషన్​లో బైఠాయించారు. తాము పీఎం భవనాన్ని ప్రజలకు చూపించాలని వస్తే ఎందుకు పారిపోతున్నారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. కాగా,  పీఎం నివాసం బయట సెక్షన్​ 163 కింద ఆంక్షలున్నాయని, ఎలాంటి ధర్నాలు చేయొద్దని ఆప్ నేతలను పోలీసులు వారించారు.

సీఎం ఆతిశీ నివాసం వద్ద బీజేపీ నేతల ఆందోళన

 ఆప్​ నేతల ఆందోళనకు ప్రతిగా ఏబీ 17 మధురా రోడ్​ లోని సీఎం ఆతిశి నివాసానికి ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్​ వీరేంద్ర సచ్​దేవా, ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి చేరుకున్నారు. 

ఇప్పటికే కేంద్రం ఆమెకు ఈ బంగ్లాను కేటాయించిందని,  ఎందుకు  6 ఫ్లాగ్​స్టాఫ్​ రోడ్​ బిల్డింగ్ (శీష్​ మహల్​)​ కావాలని ఆతిశి అడుగుతున్నారని ప్రశ్నించారు. ‘‘ఢిల్లీ సీఎం అయిన ఆతిశికి ఈ బంగ్లాను కేటాయించారు. 

ఈ బంగ్లాను మీకు ఎప్పుడు అలాట్​ చేశారో చెప్పాలి. మీకు శీష్​మహల్​లోనే నివసించాలని ఎందుకు అనుకుంటున్నారో సమాధానమివ్వాలి” అని ఆతిశిని నిలదీశారు. కావాలనే ఎన్నికల ముందు ఆప్​ నాటకాలాడుతున్నదని మండిపడ్డారు. శీష్​మహల్​ను ఇంతకుముందు ఆప్​నేతలు ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు.