తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

  • లోక్ సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం
  •  రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ బలపడుతోంది
  •  ఆంధ్రాలో వైసీపీ ఓటమి ఖాయం
  •  జగన్.. కేసీఆర్ ను ఫాలో అవుతున్రు
  •  ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ‘హైదరాబాద్ డైలాగ్స్’డిబేట్ లో స్ట్రాటజిస్ట్ పీకే


హైదరాబాద్: పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికి కోల్పోతుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుందని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి లేకుండా పోయే పరిస్థితి వస్తుందని పదే పదే చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న రాత్రి ది న్యూ ఇండియా ఎక్స్ ప్రెస్ ఆంగ్లదినపత్రిక నిర్వహించిన ‘హైదరాబాద్ డైలాగ్స్’డిబేట్ లో పీకే కీలక విషయాలను షేర్ చేసుకున్నారు. తానే బీఆర్ఎస్ కార్యకర్తను అయ్యి ఉంటే.. పార్టీ ప్రస్తుత పరిస్థితిపై కచ్చితంగా ఆందోళన చెందేవాడినన్నారు. బీజేపీ పుంజుకుంటే బీఆర్ఎస్ ఉనికే ప్రమాదంలో  పడిపోతుందని.. ఇప్పుడు అదే జరుగుతోందని అన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికి కష్టమేనంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. తెలుగు రాష్ట్ర రాజకీయాలపై పీకే  చేసిన కామెంట్లు పొలిటికల్  సర్కాల్స్ లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పడి, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉనికి లేకుండా పోయే పరిస్థితి వస్తుందని పీకే చెప్పడం ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా.. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగైపోతుందని పదే పదే ప్రస్తావించటం, ప్రస్తుతం పీకే కూడా అదే చెప్పడంతో గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతోంది.

 జగన్ కేసీఆర్ ను  ఫాలో అవుతున్రు
ఏపీలో వైసీపీ అధికారం కోల్పోతుందని పీకే చెప్పారు. ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురుకానుందని అన్నారు. ఏపీ ప్రజలు ఉచిత పథకాల కన్నా అభివృద్ధికి పట్టం కడతారని పీకే జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావును, జగన్ ఫాలో అవుతున్నారని.. తెలంగాణలో కేసీఆర్ కి ఎదురైన పరాభవమే ఆంధ్రలో జగన్ కూ ఎదురవుతుందని చెప్పారు. ఉచిత పథకాల ద్వారా ప్రజలకు డబ్బు పంచి ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం మూర్ఖత్వమని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ–జనసేన కూటమి విజయం సాధించే అవకాశాలున్నాయన్నారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైయస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం పనిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన టీం ఆ బాధ్యతల నుంచి దూరంగా ఉంది. మరో కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనుండగా జగన్ పై ప్రశాంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.  

కారు దిగుతున్రు..(బాక్స్)
పీకే అంచనా..  పార్టీ పరిస్థితి ఇందుకు దగ్గరగా ఉందనే చర్చ కొనసాగుతోంది. పక్షం రోజుల వ్యవధిలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కారు దిగడమే ఇందుకు నిదర్శనమన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని కాంగ్రెస్ లో చేరగా.. నాగర్ కర్నూల్, జహీరాబాద్ ఎంపీలు పోతుగంటి రాములు, బీబీ పాటిల్ కాషాయ కండువా కప్పుకొన్నారు. పాటిల్ బీజేపీలో చేరిన మరుసటి రోజే ఆయనకు అధినాయకత్వం బీజేపీ జహీరాబాద్ టికెట్ కేటాయించడం విశేషం. దీనికి తోడు చాలా మంది నేతలు బీజేపీతో టచ్ లోకి వెళ్తుండటం గమనార్హం. వరంగల్  జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్  కూడా, జానపద గాయకుడు  మిట్టపల్లి సురేందర్ బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. ఇంకా ఎవరెరూ ఆ పార్టీలో చేరతారనేది చర్చనీయాంశంగా మారింది.