- కోల్ కతాలో ఘటన
కోల్ కతా : జీవితం మీద విరక్తితో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలను బిర్యానీ ఆఫర్ చేసి పోలీసులు కాపాడారు. ఈ ఆసక్తికర ఘటన కోల్ కతాలో జరిగింది. బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి టైల్స్ వ్యాపారం చేసేవాడు. బిజినెస్ లో నష్టపోవడంతో భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. చిన్న కూతురు కూడా తనను విడిచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు.
జనవరి 22న మధ్యాహ్నం తన పెద్ద కుమార్తెతో కలిసి అతడు సైన్స్ సిటీకి బయల్దేరాడు. సమీపంలోని బ్రిడ్జి దగ్గరకు రాగానే బైక్ ఆపాడు. తన మొబైల్ పడిపోయిందని వెతుకున్నానని కూతురికి చెప్పాడు. కూతురిని రోడ్డుపై నిలబెట్టి బ్రిడ్జి ఎక్కి కిందకు దూకేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అతడి సూసైడ్ అటెప్ట్ను నిలువరించేందుకు ప్రయత్నించారు.
కోల్ కతాలోని ప్రముఖ హోటల్ నుంచి బిర్యానీ, జామ్ తెప్పించి ఇస్తామని ఆఫర్ చేశారు. బిర్యానీ ఆఫర్ తో అతడు ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకున్నాడు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అతడు చేసిన డ్రామాతో దాదాపుగా 20 నిమిషాల పాటు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనాదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
