భోపాల్/ ఇండోర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మాజీ చీఫ్ ఎంఎస్ గోవల్కర్ ను కించపరిచేలా ఉన్న పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ చీఫ్దిగ్విజయ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమేరకు లాయర్, ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేశ్ జోషి ఫిర్యాదుతో దిగ్విజయ్ సింగ్ పై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఇండోర్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ విషయంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ..
గోవల్కర్పై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. ఇలాంటి తప్పుడు పోస్టులతో సమాజంలో అశాంతిని సృష్టించాలన్నదే కాంగ్రెస్ నేతల అభిమతమని ఆయన విమర్శించారు. సమాజంలో అసమానతలను తొలగించేందుకు గురూజీ (గోవల్కర్) తన జీవితపర్యంతం ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. అయితే, బీజేపీ తన అధికార బలాన్ని ఉపయోగించి ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ మీడియా డిపార్ట్ మెంట్ చైర్మన్ కేకే మిశ్రా పేర్కొన్నారు.
