టీడీపీని టార్గెట్ చేసిన పోలీసులు - కోటం రెడ్డి ఆగ్రహం..!

నెల్లూరు టీడీపీ నేతల ఇంట్లో పోలీసుల సోదాలు కలకలం రేపాయి. మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లలో సోదాలు జరిపారు పోలీసులు. గతంలో నారాయణ ఇంటితో పాటు ఆయనకు సంబందించిన మెడికల్ కాలేజీలు, సిబ్బంది ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు పోలీసులు. తాజాగా ఆయన అనుచరుల ఇళ్లలో సోదాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా జడ్పీటీసీ విజేతరెడ్డి, గురుబ్రహ్మం  తదితరుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో విజేతరెడ్డి ఇంట్లో 25వేల రూపాయలు దొరికినట్లు తెలిపారు పోలీసులు. పోలీసుల సోదాల విషయం తెలుసుకున్న టీడీపీ నేత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విజేతరెడ్డి ఇంటికి చేరుకున్నారు. కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే దౌర్జన్యం చేస్తున్నారని మండి పడ్డారు. త్వరలోనే నోటిఫికేషన్ ఉందని, అన్ని వ్యవస్థలు పారదర్శకంగా పని చేయాలని అన్నారు కోటంరెడ్డి. 

నారాయణను టార్గెట్ చేసి వరుస సోదాలు నిర్వహించటం చర్చనీయాంశం అయ్యింది. అమరావతి భూముల విషయంలో నారాయణపై అభియోగాలున్న నేపథ్యంలోనే తనపై, తన అనుచరులపై ఈ వరుస దాడులకు కారణం అని టాక్ వినిపిస్తోంది. మరి, ఎన్నికల నోటిఫికేషన్ కి ముందే ఈ రేంజ్ లో ఉన్న పొలిటికల్ హీట్ నోటిఫికేషన్ వచ్చాక ఏ రేంజ్ కి చేరుతుందో చూడాలి.