వర్మను వదలని పోలీసులు.. విచారణకు రావాలంటూ ఆర్జీవీకి మరోసారి నోటీసులు

వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు ఒంగోలు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై ఆర్జీవీపై ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. 2024, నవంబర్ 19న ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలని రాంగోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు పంపారు. వ్యక్తిగత కారణాలతో నవంబర్ 19వ తేదీన ఆర్జీవీ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. 

విచారణకు హాజరయ్యేందుకు తనకు కొంత గడువు ఇవ్వాలని ఆర్జీవీ పోలీసులను రిక్వెస్ట్ చేశారు. ఆర్జీవీ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. 2024, నవంబర్ 25వ తేదీన విచారణకు హాజరు కావాలని బుధవారం (నవంబర్ 20) మరోసారి రాంగోపాల్ వర్మకు నోటీసులు పంపారు. ఈ మేరకు ఆర్జీవీ వాట్సాప్‌ నెంబర్‌కు నోటీసులు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు పంపి.. విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. దీంతో ఆర్జీవీ ఈ సారైనా విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

Also Read :- 28 ఏళ్ల అసిస్టెంట్‌తో ఏఆర్ రెహమాన్ ఎఫైర్!

ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి రాంగోపాల్ వర్మ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని ఆర్జీవీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‎ను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో చేసేదేమి లేక.. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా తనకు ముందస్తు బెయిల్ అయినా ఇవ్వాలని కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఆర్జీవీ బెయిల్ పిటిషన్‎పై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఆర్జీవీకి మరోసారి నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది.