దా..పుష్ప..విచారణకు రావాలని అల్లు అర్జున్​కు పోలీసుల నోటీసులు

  • నేడు ఉదయం11 గంటలకు చిక్కడపల్లి ఏసీపీ ముందు విచారణ
  • సంధ్య టాకీస్​ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే అర్జున్​ సహా 18 మందిపై కేసు
  • కన్‌‌ఫెషన్ స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్‌‌ చేసే అవకాశం

హైదరాబాద్‌‌, వెలుగు : పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్‌‌కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు దర్యాప్తు అధికారి చిక్కడపల్లి ఏసీపీ ముందు విచారణకు హాజరుకావాలని అందులో ఆదేశించారు. కేసు దర్యాప్తులో భాగంగా విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. పుష్ప 2 బెనిఫిట్‌‌ షో సందర్భంగా ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి మృతి చెందగా.. ఆమె కొడుకు శ్రీతేజ్​ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ సహా మొత్తం 18 మందిపై చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు.

ఈ నెల 13న ఉదయం అల్లు అర్జున్‌‌‌‌ను అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్‌‌‌‌గూడ జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌‌‌‌ మంజూరు చేయడంతో 14న జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. కేసు దర్యాప్తులో ఉండగానే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మూడు రోజుల కింద అల్లు అర్జున్​ మీడియాతో మాట్లాడాడు. పోలీసులు తనపై అవాస్తవాలు నమోదు చేశారంటూ ఆరోపించాడు.

సంధ్య థియేటర్‌‌‌‌‌‌‌‌ వద్ద జరిగిన ఘటనలో తన ప్రమేయం లేదనే ప్రయత్నం చేశాడు. కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అల్లు అర్జున్‌‌‌‌ కన్‌‌‌‌ఫెషన్ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ ఎదుట హాజరుకావాలని సోమవారం నోటీసులు పంపారు.