దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశన్నంటాయి. ధరలు పెరగడంతో చాలా చోట్ల టమాటాల చోరీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక రాష్టం కోలార్ జిల్లాలో ఉన్న టామాట మార్కెట్ లో పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాదు.. సీసీ టీవీలను ఏర్పాటు చేసి, నిరంతరం నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ నారాయణ్ చెప్పారు. కోలార్ జిల్లాలో ఉన్న టామాట మార్కెట్ ఆసియాలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ అని చెబుతున్నారు. ఇప్పటి వరకు కోలార్ టమోటా మార్కెట్ లో చోరీలు జరగలేదని ఎస్పీ నారాయణ్ చెప్పారు. అయితే.. కోలారు ఏపీఎంసీ మార్కెట్‌లోని టమోటాలను దొంగతనం చేస్తామని బెదిరింపు కాల్స్ చేయడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. వర్షాభావ పరిస్థితుల కారణంగా టమోటా ధర విపరీతంగా పెరిగింది.
టమాటా ధర ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కిలో రూ.140 నుంచి రూ.160 వరకూ పలుకుతున్న టమాటా ధర ఇంకా ఏ స్థాయికి చేరుతుందోనని సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. అదే సమయంలో పెరుగుతున్న ధర కొంతమంది టమాటా రైతుల్లో సంతోషం కూడా తీసుకొచ్చింది. గతంలో ధర లేక టమాటాలు రోడ్లపై పారబోసిన రైతులు ఇప్పుడు ఈ ధర ఉపశమనం కలిగించిందని ఊపిరి పీల్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా టమాటా ధరలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
