ఉప్పల్‎లో వింత దొంగ.. చెప్పులు, షూ కొట్టేసి ఎర్రగడ్డలో అమ్మకం

హైదరాబాద్: దొంగల్లో చాలా రకాలను చూశాం. కొందరు ఇంట్లోని డబ్బు, నగలు దొంగలిస్తే.. మరికొందరు ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు, బైకులు ఎత్తుకెళ్తారు. ఇంకొందరు చైన్ స్నాచింగ్స్, పిక్ పాకెటింగ్స్ చేస్తారు. కానీ హైదరాబాద్‎లోని రామంతపూర్‎లో వింత దొంగ పోలీసులకు చిక్కాడు. ఈ దొంగ అందరిలా డబ్బు, నగలు కాకుండా.. కేవలం ఇంటి ముందు ఉన్న చెప్పులు, బూట్లు ఎత్తుకెళ్తాడు. ఇదే ఈ దొంగ స్పెషాలిటి. మరీ ఈ వింత దొంగకు సంబంధి పోలీసులు వెల్లడించిన వివరాలు తెలుసుకుందాం.

ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్ వాసవి నగర్‎లో మల్లేష్ అనే వ్యక్తి గత కొంత కాలంగా నివాసం ఉంటున్నాడు. తాను నివాసం ఉంటున్న ఏరియాలోనే మల్లేష్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అయితే మల్లేష్ అందరి దొంగల్లా ఇంట్లోని నగదు, డబ్బులు ఎత్తుకెళ్లడం లేదు. కేవలం ఇంటి ముందు ఉన్న చెప్పులు, బూట్లు మాత్రం దొంగలిస్తున్నాడు. గత రెండు నెలల నుండి సుమారుగా 100 ఇండ్లకు పైగా దొంగతనాలు చేసి దాదాపు వెయ్యి జతల బూట్లను ఎత్తుకెళ్లాడు.

మల్లేష్ వ్యవహర శైలిపై అనుమానం రావడంతో.. గత నాలుగు రోజుల నుండి అతడిపై కాలనీవాసులు నిఘా పెట్టి దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు. దొంగను అదుపులోకి తీసుకున్న స్థానికులు ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు మల్లేష్‎పై కేసు నమోదు చేశారు పోలీసులు. మల్లేష్‎ను విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దొంగతనం చేస్తోన్న బూట్లు, చెప్పులను హైదరాబాద్ ఎర్రగడ్డ మార్కెట్లో రూ.100, 200కు అమ్ముతున్నట్లు చెప్పడంతో పోలీసులు ఖంగుతున్నారు.