పెబ్బేరులో దారి దోపిడీ కేసు చేజ్.. కరడుగట్టిన పార్థీ ముఠా అరెస్ట్

వనపర్తి, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వనపర్తి జిల్లా పెబ్బేరు టౌన్ శివారు నేషనల్ హైవే – 44పై దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. జోన్ – -2 ఐజీ సత్యనారాయణ ఆదివారం వనపర్తి జిల్లా పోలీసు ఆఫీసులో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2 రోజుల కింద పార్థీ గ్యాంగ్ ముఠా దోపిడీ చేసి మహారాష్ట్రకు పారిపోయింది. గద్వాల నుంచి పెబ్బేరు వరకు సీసీ ఫుటేజీలను పరిశీలించి అనుమాని తులను ప్రశ్నించినా క్లూస్ దొరకలేదు. ఫింగర్ ప్రింట్స్ పరిశీలించగా దొంగల ఆచూకీ దొరికింది.  పోలీసులు మహారాష్ట్ర వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో దొంగలను పట్టుకున్నారు. 

దోపిడీ ఇలా.. 

ఈనెల 18న పార్థీ ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులు చెరుకు ట్రాక్టర్లను తీసుకొచ్చి పెబ్బేరు శివారులోని హైవే -– 44 పై ట్రక్ లే బేలో పార్కింగ్ చేశారు. పక్కనే పొలాల్లో కాపు కాశారు. జగిత్యాల జిల్లాకు చెందిన రజిని కుటుంబం తిరుపతి, అరుణాచలం తీర్థయాత్రలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి దాటాక పెబ్బేరు శివారులోని ఎన్ హెచ్– 44 రోడ్ పై ట్రక్ లే బేలో కారును నిలిపారు. అర్ధరాత్రి 2:50 గంటల సమయంలో పార్థీ ముఠా సభ్యులు కారుపై రాళ్ల దాడికి దిగి  భయభ్రాంతులకు గురి చేసి దోపిడీకి పాల్పడ్డారు. 

మహిళలు, డ్రైవర్ మెడలోని బంగారు గొలుసులను లాక్కొని పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఎస్పీ గిరిధర్ పర్యవేక్షణలో డీఎస్పీ వెంకటేశ్వర్ రావు ఆధ్యర్యంలో ప్రత్యేక టీమ్ శనివారం నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించింది. నిందితులు శ్రీరామ్ శివాజీ షిండే, సచిన్ సంతోష్ షిండే, ట్రాక్టర్ డ్రైవర్లు బద్రిగ జానన్ పింపాలే, సయ్యద్ ఫిరోజ్ మెహతాబ్ ఉన్నారు. నిందితుల వద్ద రూ.7లక్షల విలువైన 20 గ్రాముల రెండు బంగారు పుస్తెలతాడు, 15 గ్రాముల చైన్, 10 గ్రాముల నల్లపూసల దండ, మూడు సెల్ ఫోన్లు, రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.