రాహుల్ గాంధీపై కేసు.. పోలీస్ స్టేషన్లో బీజేపీ, కాంగ్రెస్ పరస్పర ఫిర్యాదులు

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో జరిగిన తోపులాటలో ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలు అయిన ఘటనలో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. రాహుల్ గాంధీపై హత్యాయత్నం, ఇతర ఆరోపణలతో కేసు పెట్టాలంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ బృందం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘మకర్ ద్వార్ వద్ద ఏం జరిగిందో పోలీసులకు వివరించాం. రాహుల్ వల్లే మా ఇద్దరు ఎంపీలు గాయపడ్డారు. ప్రతాప్ సారంగిని రాహుల్ నెట్టేశారు’’అని  తెలిపారు.

బీజేపీకి కౌంటర్​గా కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు అదే పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. రాహుల్ ను, ఖర్గేను తోసేశారని, కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా,  బీజేపీ ఎంపీల ఫిర్యాదు మేరకు భౌతిక దాడికి రెచ్చగొట్టారన్న ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.