వికారాబాద్ లో పోలీసుల దాష్టీకం..ఫిర్యాదు దారునే చితకబాదిన వైనం

వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్లో పోలీసుల దాష్టీకం వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫిర్యాదు దారుడినే పోలీసులు చితకబాదారు. సంతోష్ అనే యువకుడిని ఎస్సై ఆనంద్ కుమార్, కానిస్టేబుళ్లు విచక్షణా రహితంగా కొట్టారు. దోమ మండలం దిర్సంపల్లి తాండాకు చెందిన రుక్కిబాయి, సంతోష్ లకు వారి దాయాదుల మధ్య నాలుగు రోజుల క్రితం భూవివాదం జరిగింది. అదే రోజు రుక్కిబాయి, సంతోష్ లు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

తమ ఫిర్యాదు పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కేసు వివరాలు తెలుసుకునేందుకు పోలీసు స్టేషన్ కు వచ్చి ఎస్సై ని ఆరా తీశారు. భూ వివాదానికి కారణమైన వారిని స్టేషన్ కు పిలిపించిన ఎస్సై ఇరువురు మాట్లాడుకోమని సమయం ఇచ్చారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి మళ్ళీ గొడవకు దారి తీసింది. దీంతో ఒకరిపై ఒకరు పోలీసు స్టేషన్ ఆవరణలోనే దాడి చేసుకుంటుండగా పోలీసులు వారిని అడ్డుకొని పోలీసు స్టేషన్లోకి లాకెళ్ళారు.

అందరిని మందలించి తనను మాత్రం ఎస్సై, కానిస్టేబుళ్లు విచక్షణా రహితంగా కొట్టారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.తన ఆరోగ్యం బాగా లేదని చెప్పిన వినకుండా రక్తం వచ్చేలా కొట్టారని సంతోష్ ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ క్రమంలో తన ఫోన్ కూడా పగిలి పోయిందని న్యాయం చేయాలని ఫిర్యాదు చేస్తే తమపైనే దాడి చేయడం సరికాదని బాధితుడు ఆరోపిస్తున్నాడు.తనను  అనవసరంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు.