షర్మిల అరెస్ట్ - ఉద్రిక్తతలకు దారి తీసిన ఛలో సెక్రటేరియట్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సి నోటిఫికేషన్ రద్దు మెగా డీఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన ఛలో సెక్రటేరియేట్ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ముందుగానే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతలు సెక్రటేరియట్ కి వెళ్లకుండా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విజయవాడ నుండి పాదయాత్రతో సెక్రటేరియేట్ కి బయలుదేరారు. దారి మధ్యలోనే పోలీసులు ఆమెను అడ్డుకొని వెనక్కి వెళ్ళమని ఎంతచెప్పినా వినకపోవడంతో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు.

షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేయటంతో కొండవీటి ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో సీఎం జగన్ పై షర్మిల ఫైర్ అయ్యారు, ఈ రోజు జరిగిన సంఘటనతో  వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభిస్తోందని, విజయమ్మ కూడా ఈ సంఘటన గురించి బాధపడుతుంటారని అన్నారు. తన పోరాటం నిరుద్యోగుల కోసమే అని అన్నారు. సచివాలయంలో వినతిపత్రం ఇచ్చే స్వేఛ్చ కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

ఒక ఆడబిడ్డనని కూడా చూడకుండా ఇలా వ్యవహరించటం పాపమని అన్నారు. వీళ్లకు పాలన చేతకాదని, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే నోటిఫికేషన్ ఇవ్వడం కూడా చేతకాదని అన్నారు. షర్మిలను అరెస్ట్ చేసే సమయంలో ఆమెకు స్వల్ప గాయాలవ్వటంతో కార్యకర్తలు పోలీసులపై మండిపడ్డారు.