గంజాయి కేసు ఛేదించిన పోలీసులు..ఒకరి అరెస్టు, రిమాండ్ కు తరలింపు : సీఐ వెంకటరాజాగౌడ్

రామాయంపేట, వెలుగు: కారులో అక్రమంగా గంజాయి తరలించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెంకటరాజాగౌడ్ తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత అక్టోబర్​లో ఉత్తర ప్రదేశ్ నోయిడా ప్రాంతానికి చెందిన అమిత్ కుమార్ మరో ఇద్దరితో కలిసి కారులో నోయిడా నుంచి ఒడిశా మీదుగా విశాఖ పట్నం వచ్చి అక్కడ గంజాయి తీసుకుని  తిరుగు ప్రయణమయ్యారు. ఈ క్రమంలో  అక్టోబర్ 9న రామాయంపేట శివారులోని బైపాస్ రోడ్డులో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

దీంతో వారు కారును అక్కడే వదిలేసి పారిపోయారు. ప్రమాదం వివరాలు తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలంలో పరిశీలించగా ప్రమాదానికి గురైన కారులో 87.75 కిలోల ఎండు గంజాయి దొరికింది. ఈ మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక టీమ్​ల ద్వారా నిందితుల కోసం గాలించగా ఉత్తర ప్రదేశ్ లోని నోయిడా ప్రాంతానికి చెందిన అమిత్ కుమార్ పట్టుబడ్డాడు. అతన్ని గత నెల 23 న కోర్టులో హాజరు పరిచిన అనంతరం తిరిగి ఈనెల 9 న కస్టడీలోకి తీసుకుని విచారించగా గంజాయి రవాణా విషయం వెల్లడైందని తెలిపారు. అతడితో పాటు మరో ఇద్దరు ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.