పుష్ప2 ప్రీమియర్ షో నుంచి అల్లు అర్జున్ అరెస్టు వరకు.. ఆ రోజు ఏం జరిగిందంటే

  • ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్​రోడ్​ సంధ్య థియేటర్​లో పుష్ప–2 బెనిఫిట్​​ షో
  • ​షోకు అల్లు అర్జున్​రాక..కారుపైకి ఎక్కి అభివాదం
  • ఎగబడిన జనం.. తొక్కిసలాటలో రేవతి మృతి, కొడుకు శ్రీతేజ్​కు గాయాలు
  • ఇప్పటికీ కోమాలో వెంటిలేటర్​పైనే..

ముషీరాబాద్, వెలుగు : శుక్రవారం ఉదయం నుంచి మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్​ అరెస్ట్​ అయిన వార్తే చక్కర్లు కొడుతున్నది. అసలు ఆ రోజున ఏం జరిగిందంటే..హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య 70 ఎంఎం థియేటర్ వద్ద ఈ నెల నాలుగో తేదీన పుష్ప –2 సినిమా బెనిఫిట్​ షో ఏర్పాటు చేశారు. దీనికి హీరో అల్లు అర్జున్ తోపాటు మూవీ టీం వస్తున్నారని తెలుసుకున్న జనం ఎగబడ్డారు. బెనిఫిట్​షో సందర్భంగా అల్లు అర్జున్​ను చూడాలని దిల్​సుఖ్​నగర్​కు చెందిన భాస్కర్, రేవతి(35), వారి కొడుకు శ్రీ తేజ్ (9), కూతురు  కోసం టికెట్లు కొనుగోలు చేశారు. రాత్రి అల్లు అర్జున్​రావడానికి కొద్ది సేపు ముందు వారు థియేటర్​కు చేరుకున్నారు.

అల్లు అర్జున్ వస్తుండడంతో థియేటర్ వద్ద అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు సుమారు 30 మంది, పోలీసులు 20 మంది ఉన్నారు. అయితే ఊహించనంత సంఖ్యలో అభిమానులు అక్కడ గుమిగూడారు. ఫ్యాన్స్​ను చూసిన అల్లు అర్జున్ కారుపైకి ఎక్కి ర్యాలీగా అందరికీ నమస్కరిస్తూ థియేటర్​లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అల్లు అర్జున్​వైపు అభిమానులు దూసుకువచ్చారు. సెల్ఫీ వీడియోలు తీసుకునే క్రమంలో కొందరు, ఆయనను టచ్​చేయాలని మరికొందరు ముందుకు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయగా, అభిమానులను బౌన్సర్లు, పర్సనల్​సెక్యూరిటీ వెనక్కి నెట్టారు. దీంతో తొక్కి సలాట జరిగింది.  

థియేటర్​లోకి వెళ్లాక ఘటన 

అల్లు అర్జున్​రాత్రి 9:30 కు థియేటర్​కు రాగా..ఆయన లోపలకు వెళ్లడానికి పోలీసులు, బౌన్సర్లు, పర్సనల్​సెక్యూరిటీ అందరినీ చెదరగొట్టి రూట్​క్లియర్​చేశారు. ఈ క్రమంలో బయటి నుంచి లోపలకు వచ్చేందుకు చాలామంది అభిమానులు దూసుకువచ్చారు. అప్పటికే థియేటర్​లోపల ఒకవైపు భాస్కర్ అతడి కూతురు, మరోవైపు రేవతి, ఈమె కొడుకు శ్రీతేజ్​ ఉన్నారు. అర్జున్​వస్తున్నాడని తెలుసుకుని లోపలున్న అభిమానులంతా తోసుకురాగా వారితో పాటు శ్రీతేజ్ ​కూడా పరిగెత్తాడు. కొడుకును పట్టుకునే క్రమంలో తల్లి రేవతి కూడా వెంట పరుగెత్తింది. దీంతో శ్రీతేజ్​కిందపడగా అభిమానులంతా అతడిని తొక్కుకుంటూ వెళ్లారు. శ్రీతేజ్​ను కాపాడుకునే ప్రయత్నంలో రేవతి కూడా ప్రేక్షకుల కాళ్ల కింద నలిగిపోయింది.

ALSO READ : పుష్ప అరెస్టు..తొక్కిసలాట ఘటనలో చంచల్​గూడ జైలుకు అల్లు అర్జున్​

మరికొంతమంది కూడా గాయపడ్డారు. ఈ దశలో అక్కడే ఉన్న పోలీసులు.. అరుపులు, కేకలు విని అందరినీ చెదరగొట్టారు. స్పృహతప్పిన రేవతి, అతడి కొడుకును బయటకు తీసుకువచ్చి సీపీఆర్​ చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోవడంతో రేవతిని డీడీ హాస్పిటల్​కు తరలించారు. అక్కడే రేవతి తుదిశ్వాస విడిచింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజ్​ను పోలీసులు హుటాహుటిన కిమ్స్​దవాఖానకు తరలించారు.  

ఇంకా అందని అల్లు అర్జున్​ ఎక్స్​గ్రేషియా 

ఘటన జరిగిన 2 రోజుల తర్వాత అల్లు అర్జున్​మీడియాకు ఒక వీడియో సందేశం  రిలీజ్​చేశారు. జరిగిన ఘటనకు తాను చాలా బాధపడుతున్నానని, తనకు ఘటన జరిగిన తెల్లవారి విషయం తెలిసిందని చెప్పారు. మృతురాలి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించడంతోపాటు బాబు శ్రీతేజ్​కు వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని ప్రకటించారు. ఇది జరిగి తొమ్మిది రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ డబ్బులను బాధిత కుటుంబసభ్యులకు అందజేయలేదు. కనీసం వారిని పరామర్శించలేదు. హాస్పిటల్  బిల్స్ మాత్రం అల్లు అర్జున్ కడుతున్నారని భాస్కర్​ చెప్పారు.  

రేపు రేవతి పెద్దకర్మ 

రేవతి నాలుగో తేదీన చనిపోవడంతో14వ తేదీన (శనివారం) పెద్దకర్మ నిర్వహిస్తున్నారు. రేవతి చనిపోవడం, కొడుకు దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో భాస్కర్ ఉన్నాడు.  ఉన్న ఒక్కగానొక్క కూతురును చూసుకుంటూ.. దవాఖానకు వెళ్లి వస్తూ ఇబ్బందులు పడుతున్నాడు. 

విషమంగానే బాలుడి పరిస్థితి 

కిమ్స్​ దవాఖానలో చేరిన శ్రీతేజ్​పరిస్థితి అప్పటి నుంచి విషమంగానే ఉంది. తొమ్మిది రోజులుగా శ్రీ తేజ్ కిమ్స్ దవాఖాలోలో వెంటిలేటర్ పైనే ఉన్నాడు.  ఎప్పుడు స్పృహలోకి వస్తాడోనని కుటుంబ సభ్యులు  ఎదురుచూస్తున్నారు. అతడి లంగ్స్​పని చేయడం లేదని డాక్టర్లు తేల్చారు. ఇన్ని రోజులవుతున్నా కండ్లు తెరిచి చూడకపోవడంతో తండ్రి భాస్కర్ ఆందోళన చెందుతున్నారు.