నకిలీ ఐపీఎస్ అధికారి ఆటకట్టించిన పోలీసులు

నకిలీ ఐపీఎస్ అధికారి ఆటకట్టించిన పోలీసులు
హైదరాబాద్ కు చెందిన మమహ్మద్ ముస్తాక్ @ ఢిల్లీ ముస్తాక్ గా గుర్తించిన పోలీసులు కాంట్రాక్టులు ఇప్పిస్తానని.. ఉద్యోగాలిప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన మోసగాడు నిందితుడి నుండి రూ.12 లక్షలు స్వాధీనం తిరుపతి: తాను ఐపీఎస్ అధికారినంటూ.. ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి అమాయకులను మోసం చేస్తున్న మోసగాడికి చెక్ పెట్టారు తిరుపతి పోలీసులు. తాను హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా పనిచేస్తున్నానని చెప్పుకుంటూ బాధితుల నుండి దాదాపు రూ.39 లక్షలు వసూలు చేసుకుని ఫోన్లు స్విచాఫ్ చేసి ఆచూకీ లేకుండా పోయాడు. మోసగాడి గురించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడి  ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. తిరుపతి రైల్వే స్టేషన్లో విజయ డైరీ మిల్క్ నడిపే శివలీలాదేవితో మొదట పరిచయం చేసుకుని.. ఆమె ద్వారా పొదుపు మహిళలు, ఇతర అమాయకులను మోసం చేసినట్లు గుర్తించారు.  హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ ముస్తాక్ అలియాస్ ఢిల్లీ ముస్తాక్ మొదట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే వాడని గుర్తించారు. 2013లో శ్రీకాళహస్తికి చెందిన వహీదా అనే మహిళ ను రెండో పెళ్లి చేసుకుని.. ఆమె కోసం తరచూ హైదరాబాద్ నుండి శ్రీకాళహస్తికి వచ్చి వెళుతుండేవాడని నిర్ధారించుకున్నారు. తాను ఐపీఎస్ అధికారినని, హైదరాబాదు లో పోలీసు కమీషనర్ గా పని చేస్తున్నానని చెబుతూ.. తనకు ప్రభుత్వంలో, రాజకీయ నాయకులతో బాగా పరిచయాలున్నాయని, తాను ఎవరికైనా ఇసుక క్వారీలు, పిల్లలకు టీటీడీ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నమ్మిస్తూ.. వేర్వేరు వ్యక్తుల నుండి సుమారు రూ. 39 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో విజయ డైరీ మిల్క్ షాపును నడిపే శివలీలా దేవితో పరిచయం పెంచుకుని ఆమెకు ద్వారా  పొదుపు గ్రూపు సభ్యులు మునిరాజమ్మ, భాను , యశోద , జయలక్ష్మీ, హేమలత, నాగరాజు, మధు లతో పరిచయం పెంచుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని , డ్వాక్రా మహిళలకు ఇసుక క్వారీలు ఏర్పాటు చేయిస్తానని నమ్మించి వారినుంచి 39 లక్షలు వసూలు చేశాడు. డబ్బులు వసూలు చేసుకున్న తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరార్ అయ్యాడు. బాధితురాలు హేమలత ఇచ్చిన ఫిర్యాదు పై జిల్లా ఎస్‌పి ఆవుల రమేశ్ రెడ్డి స్పందించారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అడిషనల్ ఎస్‌పి మునిరామయ్య, డి.యస్.పి మురళీధర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు అప్పగించారు.  కేసు నమోదు చేసిన తిరుపతి సీసీఎస్ పోలీసులకు దిశానిర్దేశం చేస్తూ.. దర్యాప్తును ముమ్మరం చేశారు. గురువారం తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిపై నిఘా పెట్టి పరిశీలించగా.. నకిలీ ఐపీఎస్, ప్రధాన నిందితుడు మహమ్మద్ ముస్తాక్ @ డిల్లీ ముస్తాక్ అని తేలింది. మఫ్టీలో ప్రత్యేక బలగాలు వెళ్లి  తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద నకిలీ ఐపీఎస్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేయడంలో, ముద్దాయిని అరెస్టు చేయడంలో విశేష ప్రతిభ కనపరచిన సీసీఎస్ సీఐ మోహన్ ను, వారి సిబ్బందిని జిల్లా ఎస్‌పి అభినందించారు. వారికి రివార్డులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.