గచ్చిబౌలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అత్యాచారం కేసులో ఒకరు అరెస్ట్

గచ్చిబౌలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బోరబండకు చెందిన ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అతన్ని విచారిస్తున్నారు. 

సోమవారం(అక్టోబర్ 14) అర్ధరాత్రి ఆర్‌సీ పురం వద్ద యువతి ఆటో ఎక్కింది. అప్పటికే అలసిపోయి ఉండటంతో మెల్లగా నిద్రలోకి జారుకుంది. దానిని పసిగట్టిన ఆటో డ్రైవర్ తన వాహనాన్ని గచ్చిబౌలి ఏరియాలోని మసీద్ బండ సమీపంలో ఉన్న కుడికుంట చెరువు వైపు తీసుకెళ్లాడు. అప్పటికి సమయం దాదాపు అర్ధరాత్రి 2.30 నిమిషాలు కావొస్తోంది. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాక నిద్రిస్తున్న యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఉలిక్కిపడిన యువతి తనను తాను కాపాడుకోవడానికి గట్టిగా కేకలు వేసింది. దాంతో, భయపడిన ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. 

ALSO READ | మంత్రి కొండా సురేఖ ఫొటోలు మార్ఫింగ్ కేసు ఇద్దరు అరెస్ట్‌

ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం అర్ధరాత్రి ఆర్‌సీ పురం వద్ద తాను ఆటో ఎక్కినట్లు ఫిర్యాదులో పేర్కొన్న ఆమె.. 2:30 గంటల సమయంలో ఆటో మసీద్‌ బండ ప్రాంతానికి చేరుకోగానే డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. అనంతరం ఆటో డ్రైవర్‌ పారిపోయినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.