అమరావతి: ఈవీఎం, వీవీఫ్యాట్లను ధ్వంసం చేసిన కేసులో నిందితుడైనన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈసీ ఆదేశంలో రామకృష్ణారెడ్డితోపాటు ఆయన సోదరుడిపైనా పోలీసులు 307 కింద కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. పిన్నెల్లి సంగారెడ్డి వైపు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద కారును స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి పోలీసుల కళ్లుగప్పి పరారైనట్టు సమాచారం.
సాయంత్రంలోగా రిపోర్ట్ ఇవ్వండి
ఈవీఎం ధ్వంసం పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ ఎందుకు ఎమ్మెల్యేను అరెస్టు చేయలేదని మండిపడింది. పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై సాయంత్రం 5లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్‌పోర్టులను ఏపీ పోలీసులు అప్రమత్తం చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం 202తోపాటు ఏడు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో పుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీంతో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు.