పెస్ట్ కంట్రోల్ చేపిస్తున్నారా..! జాగ్రత్త.. ఇద్దరు పిల్లల ప్రాణం తీసిన విషపూరిత రసాయనాలు

ఎలుకల బెడదను నివారించడానికి చేపట్టిన పెస్ట్ కంట్రోల్ ఇద్దరు పిల్లల ప్రాణం తీసింది. ఈ భయంకరమైన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

బ్యాంకు ఉద్యోగి గిరిధరన్ (34).. భార్య పవిత్ర, ఇద్దరు పిల్లలు(వైష్ణవి, సాయి సుదర్శన్)తో కలిసి కుండ్రత్తూరులోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. వీరుంటున్న గేటెడ్ కమ్యూనిటీలో ఎలుకల బెడద ఎక్కువ ఉందట. వాటిని నివారించడానికి గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు.. ఇటీవల ఓ పెస్ట్ కంట్రోల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చకున్నారు. ఇక్కడే తప్పు దొర్లింది. ఎలాగైనా ఎలుకలను చంపాలనుకున్న పెస్ట్ కంట్రోల్ సిబ్బంది అధిక మోతాదులో రసాయనాలు వదిలారు.

ఈ విషయం తెలియని గిరిధరన్ కుటుంబం ఎప్పటిలానే రాత్రి సమయంలో ఏసీ ఆన్ చేసుకొని నిద్రపోయారు. పెస్ట్ కంట్రోల్ సిబ్బంది వదిలిన రసాయనాలు ఏసీ గుండా వారు నిద్రపోయిన గదిలోకి ప్రవేశించడంతో.. గాలిని పీల్చి ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గిరిధరన్ సైతం ఊపిరి పీల్చడానికి ఇబ్బందిగా అనిపించడంతో స్నేహితుడికి ఫోన్ చేసి సహాయం అడిగాడు. నిమిషాల వ్యవధిలో స్నేహితుడు అక్కడికి చేరుకోగా.. అప్పటికే  కుటుంబమంతా అపస్మారక స్థితిలో ఉన్నారు. హుటాహుటీన నలుగురిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ALSO READ | డిజిటల్ అరెస్ట్.. రిటైర్డ్ ఇంజినీర్​ను నిర్బంధించి 10 కోట్లు దోచిన కేటుగాళ్లు

విషపూరిత రసాయనాలు పీల్చి పిల్లలు ఇద్దరూ ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. విషపూరితమైన పదార్థాన్ని అధికంగా వాడడమే ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణమని తేల్చారు. సదరు పెస్ట్ కంట్రోల్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం గిరిధరన్‌, ఆయన భార్య పవిత్ర ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాలు వదిలిన కుమార్తె, కుమారుడి అంత్యక్రియలు చేయలేని పరిస్థితి వీరిది. ఎవరైనా పెస్ట్ కంట్రోల్ సేవలు ఉపయోగించుకోవాలనుకుంటే, సురక్షితమైన పద్ధతులను అవలంభించండి.