- ప్రధాని జీవిత విశేషాలతో వెబ్‌సైట్‌ను ప్రారంభించిన నెటిజన్లు
- modistory.in పేరిట ప్రజల ముందుకు మోడీ చరిత్ర
న్యూఢిల్లీ: ప్రముఖుల జీవితం గురించి తెలియాలంటే.. వాళ్ల జీవితాల్లోని ఆటుపోట్లు, ఆసక్తికర సంఘటనలు, విషాదలన్నింటినీ ఒక్కో అక్షరం గా మలచిన జీవితచరిత్ర చదివి తెలుసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ జీవిత విశేషాలనూ తెలుసుకునే అవకాశం వచ్చింది. కొందరు నెటిజన్లు.. ఆయన జీవితానికి డిజిటల్ రూపాన్నిచ్చారు. ‘మోడీ స్టోరీ’ పేరిట ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. modistory.in వెబ్సైట్లో ఆయన కథలను ప్రజల ముందుంచారు. అంతేకాదు.. సామాన్య ప్రజలూ మోడీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అందులో కథను పబ్లిష్ చేసే అవకాశం కల్పించారు.
ఆ గ్లాసు పాలు.. మోడీని కదిలించినయ్
ఒక సందర్భంలో మోడీకి ఎదురైన ఓ సంఘటన గురించి గుజరాత్‌కు చెందిన డాక్టర్ అనిల్ రావల్ వివరించారు. 1980ల్లో ప్రధాని మోడీతో కలిసి ప్రయాణించినప్పుడు.. పేద ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇంటి వద్ద జరిగిన ఘటనను చెప్పారన్నారు. మోడీ మాటల్లోనే ఆ విషయాన్ని వివరించారు. ‘‘ఓసారి మురికివాడలోని ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇంటికి వెళ్లా. మట్టిగోడలు, రేకులతో కప్పిన చిన్న ఇల్లు అది. లోపలికి వెళ్లగానే ఆ కార్యకర్త భార్య పిల్లాడిని ఎత్తుకొని వచ్చింది. నాకు అన్నం, సగం సజ్జ రొట్టె, ఓ కప్పు పాలను ఇచ్చారు. నేను తింటూ ఉండగా ఆ తల్లి ఒడిలో కూర్చున్న చిన్నారి ఆ పాల కప్పువైపే చూశాడు. ఆ పాలు అతడి కోసమేనని నాకు అర్థమైంది. నేను ఆ పాలను అలాగే వదిలేశా. ఆ తర్వాత చిన్నారికి తల్లి ఆ పాలను పట్టించింది. ఒకే ఒక్క గుటకలో పాలన్నింటినీ చిన్నారి తాగేశాడు. అది చూసి చలించిపోయాను’’ అంటూ మోడీ చెప్పుకొచ్చారని డాక్టర్ అనిల్ చెప్పారు.
మారు వేషంలో ఓసారి..
ప్రధాని జీవితంలో ఎవరికీ తెలియని విషయం ఇంకోటి కూడా ఉందట. గుజరాత్‌కే చెందిన రోహిత్ అగర్వాల్ అనే వ్యక్తి ఆ ఘటనను చెప్పుకొచ్చారు. ‘‘ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ సాగుతున్న రోజులవి. ఒకసారి సిక్కు వేషంలో బయటకొచ్చిన మోడీ.. పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఓ పోలీసు అధికారి నేరుగా సిక్కు వేషంలో ఉన్న మోడీ దగ్గరకే వచ్చి.. మోడీ ఇల్లు ఎక్కడ అని అడిగారు. అయితే, ఇంట్లోకి వెళ్లి ఎక్కడున్నారో కనుక్కొని రా.. అంటూ పోలీసు హుకూం జారీ చేశారు. దీంతో అక్కడి నుంచి నా సోదరుడితో కలిసి స్కూటర్‌పై మోడీ తప్పించుకున్నారు’’ అని రోహిత్ చెప్పారు.
