తెలంగాణలోకి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నరు: సీఎం

  • ఇన్వెస్టర్లు రాకుండా పీఎంవోనే అడ్డుపడుతున్నది
  • పెట్టుబడులను ప్రధాని మోదీ గుజరాత్​కు తరలిస్తున్నరు : సీఎం
  • ఇట్లయితే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఎలా సాధ్యం? 
  • కేటీఆర్​పై విచారణకు గవర్నర్ అనుమతి కోరామని వెల్లడి
  • ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ ‘అడ్డా’ ప్రోగ్రామ్​లో పాల్గొన్న సీఎం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు పెట్టుబడులు రాకుండా పీఎంవో అడ్డుకుంటున్నదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ప్రయత్నాలు చేస్తుంటే.. ఆ పెట్టుబడులు గుజరాత్ లో పెట్టాలని వాళ్లకు సూచిస్తున్నదని చెప్పారు. ఇందుకు సెమీ కండక్టర్స్ ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. మోదీ దేశానికి కాకుండా గుజరాత్ కు ప్రధానిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన గుజరాత్ కోసమే పని చేస్తున్నారని అన్నారు. 

కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలకు చేయూతనిచ్చిందని.. కానీ ప్రధాని మోదీ మాత్రం బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ, ఏపీ, కర్నాటక, ఇతర రాష్ట్రాలు లేకుండా ప్రధాని మోదీ చెబుతున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ‘‘భౌగోళికంగా తెలంగాణ  ఏపీ ఐటీ, ఫార్మా రంగాల పెట్టుబడులకు అనువైనవి. కానీ ఈ ఐటీ కంపెనీలను గుజరాత్ కు మళ్లించడం సరికాదు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాలకు మద్దతిస్తే 6 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఇవ్వగలం. అప్పుడు మోదీ 10 ట్రిలియన్ల డాలర్ల ఎకానమీని కూడా కల కనొచ్చు” అని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలోని ఓ హోటల్ లో ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నిర్వహించిన ‘అడ్డా’ ప్రోగ్రామ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.  

ఆ నాలుగు కీలక ప్రాజెక్టులు.. 

తెలంగాణలో వచ్చే పదేండ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ కు రెండుసార్లు అధికారం ఇచ్చారని, మళ్లీ అదే సంప్రదాయం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలని, దానికి సీఎం కావాలని తాను కలలు కన్నానని.. అవి రెండూ నెరవేరాయని చెప్పారు. ఒకసారి మంత్రి పదవి అవకాశం వచ్చినా తిరస్కరించానని తెలిపారు. ‘‘ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్, ట్రిపుల్ ఆర్, రేడియల్ రోడ్లు నాకు కీలక అంశాలు. అవి నా పెట్ ప్రాజెక్టులు” అని పేర్కొన్నారు. తాను చేపట్టిన ప్రాజెక్టులన్నీ పదేండ్లలో పూర్తి చేస్తానని వెల్లడించారు. 

కులగణనతో ప్రజలకు మేలు.. 

తమ ప్రభుత్వం చేపట్టిన కులగణనతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘తెలంగాణలో చేపట్టిన కులగణనను ఎక్స్ రేగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. అయితే దాన్ని నేను మెగా హెల్త్ చెకప్ ఫర్ సొసైటీ అంటాను. నెహ్రూ, ఇందిరా పాలన 1.0.. రాజీవ్ గాంధీ, నర్సింహారావు పాలన 2.0.. ఇప్పుడు సోనియా, రాహుల్ టైమ్ లో పాలన సోషల్ జస్టిస్ 3.0. ఈ 3.0లో కులగణన దేశంలోని అన్నింటినీ మార్చేస్తుంది” అని అన్నారు.

నైతికంగా మోదీ ఓడినట్టే.. 

ఒక్క అడుగు అటుఇటు వేస్తే కేంద్రంలో మోదీ సర్కార్ ఉండదని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ‘‘ప్రస్తుతం చంద్రబాబు, నితీశ్ సహకారంతోనే బీజేపీ అధికారంలో ఉంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలను నేను మోదీ ఓటమిగానే చూస్తాను తప్ప.. బీజేపీ ఓటమిగా కాదు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ బ్రాండ్, గ్యారంటీ పేరుతోనే బీజేపీ పోటీకి వెళ్లింది. కానీ ప్రజలు మాత్రం మోదీని అంగీకరించలేదు. నేను ముందు నుంచి మోదీ వారంటీకి కాలం చెల్లిందని చెబుతున్నాను. 400 సీట్లు వస్తాయని చెప్పుకున్న బీజేపీ 240కి పడిపోయింది. కాంగ్రెస్ కు 40 సీట్లు మాత్రమే వస్తాయని వాళ్లు అన్నారు. కానీ అవి కాస్తా 1‌‌‌‌00కు చేరాయి. ఈ సంఖ్యలు చూస్తే బీజేపీ ఓడిందని స్పష్టమవుతున్నది” అని పేర్కొన్నారు.  

విభజన రాజకీయాలు మంచిది కాదు..

విభజన రాజకీయాలు దేశానికి మంచిది కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెడిసిన్ ఎంత మంచిదైనా, ఎంత పెద్ద వ్యాధి కోసమైనా.. ఏదో ఒకరోజు ఎక్స్ పైర్ అయిపోతుంది. అదే బీజేపీకి వర్తిస్తుందని కామెంట్ చేశారు. ‘‘తెలంగాణను గాంధీ కుటుంబానికి ఏటీఎంగా మార్చారని ప్రధాని మోదీ అంటున్నారు. గాంధీ కుటుంబానికి పైసలే కావాలనుకుంటే.. దేశం కోసం ఆ కుటుంబం ఎందుకు ప్రాణాలర్పించింది. బలిదానాల తర్వాత కూడా దేశం కోసం ఎందుకు నిలబడింది? ఒక ప్రధాని స్థాయి వ్యక్తి ఇలాంటి విమర్శలు చేయడం సరికాదు” అని అన్నారు.

నేను సైనికుడిని మాత్రమే

హ‌‌ర్యానాలో కాంగ్రెస్​ ఎందుకు ఓడిపోయిందో తనకు తెలియ‌‌దని, అక్కడ ఓట‌‌మిపై తాను అధ్యయ‌‌నం చేయ‌‌లేదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘తెలంగాణ‌‌లో మేం క‌‌ష్టప‌‌డి ప‌‌ని చేశాం..తెలంగాణ‌‌లో సోనియా గాంధీ పేరుపై ఓట్లు అడిగాం..తెలంగాణ రాష్ట్ర క‌‌ల‌‌ను నెర‌‌వేర్చుతాన‌‌ని ఆమె మాట ఇచ్చి నెర‌‌వేర్చారు.. నేను సైనికుడిని మాత్రమే.. మేం ఆమె మాట‌‌ను వినియోగించుకున్నాం.. హ‌‌ర్యానాలో జాట్‌‌, -నాన్ జాట్ అంశం వ‌‌చ్చి ఉండొచ్చు. అక్కడ  రాహుల్ గాంధీ పేరుపై ఓటు అడిగి ఉంటే వేరేలా ఉండేది. బీజేపీ వాళ్లు స‌‌ర్పంచ్​, సొసైటీ ఎన్నిక‌‌ల్లోనూ మోదీ పేరుతో ఓట్లు అడుగుతున్నరు. స‌‌ర్పంచ్​ ఎన్నికలకు, మోదీకి ఏం సంబంధం?” అని ఆయన ప్రశ్నించారు.  

వెన్నుపోటుకు మారుపేరు షిండే

తాను మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నానని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. ‘‘మ‌‌హారాష్ట్రలో ఇప్పుడు గుజ‌‌రాత్ వ‌‌ర్సెస్ మ‌‌రాఠా.. తోబుట్టుల పోరు నడుస్తున్నది. మ‌‌హారాష్ట్ర చ‌‌రిత్ర గురించి ఇన్నాళ్లుగా మ‌‌నం ఛ‌‌త్రప‌‌తి శివాజీ మ‌‌హారాజ్, ఫూలే, అంబేద్కర్ గురించి చ‌‌దువుకున్నాం.. త‌‌ర్వాత బాలాసాహెబ్ ఠాక్రే, శ‌‌ర‌‌ద్ ప‌‌వార్ గురించి తెలుసుకున్నాం.. ఇప్పుడు ఏక్‌‌నాథ్ షిండే, అజిత్ ప‌‌వార్‌‌, ఫ‌‌డ్నవీస్ ను చూస్తున్నాం.. ఎక్కడి నుంచి ఎక్కడికి ప‌‌డిపోయాం.. ఇప్పుడు ఎక్కడైనా వెన్నుపోటు పోడిస్తే వారిని ఏక్‌‌నాథ్  షిండే అంటున్నారు.. షిండే త‌‌యార‌‌య్యాడ‌‌నే అంశం దేశ‌‌వ్యాప్తంగా పాపుల‌‌ర్ అయింది” అని వ్యాఖ్యానించారు.  

మాకు ఏ రాష్ట్రమూ ఆదర్శం కాదు.. 

తెలంగాణకు గుజరాత్ గానీ, మరో రాష్ట్రం గానీ ఆదర్శం కాదని.. హైదరాబాద్ ను న్యూయార్క్, సియోల్, టోక్యోలా అభివృద్ధి పరచడమే తన లక్ష్యమని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. ఏబీవీపీ, టీడీపీ, కాంగ్రెస్ లో ఏ లక్షణం మీకు ఇష్టమని అడగ్గా.. ఏబీవీపీకి దేశం పట్ల ఉన్న అంకిత భావం, తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి పట్ల ఉన్న దృక్పథం, కాంగ్రెస్ లో సామాజిక న్యాయం తనకు ఇష్టమని సీఎం రేవంత్ సమాధానమిచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యలు ఉన్న మాట నిజమేనని, వాటిని రెండు రాష్ట్రాలు కలిసి చర్చించి పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు. ఇందుకోసం తాము ఢిల్లీ వచ్చి కేంద్రం మధ్యవర్తిత్వాన్ని కోరనవసరం లేదని తెలిపారు. బ్యూరోక్రసీ, రెడ్ టేపిజం లేకుండా ప్రజలు నేరుగా తమ సమస్యలను డాష్ బోర్డ్ ద్వారా తెలిపే యాప్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ వేగంగా ఎదుగుతున్నది.. 

దేశంలో తెలంగాణ వేగంగా ఎదుగుతున్నదని రేవంత్ అన్నారు. తెలంగాణ మోడల్ అంటే.. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ గుడ్ గవర్నెన్స్ అని చెప్పారు. కేవలం సంక్షేమంపై ఫోకస్ చేస్తే అభివృద్ధి ఉండదని, అలాగే కేవలం అభివృద్ధి గురించే ఆలోచిస్తే పేదలకు ఏమీ అందదన్నారు. అందుకే సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని తెలిపారు. ఆరు గ్యారంటీల అమలు తమకు రెండో ప్రాధాన్య అంశమని వెల్లడించారు. ఏడో గ్యారంటీ కింద తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యం ఇస్తానని మాటిచ్చానని పేర్కొన్నారు. 

పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. పదిసార్లు కూడా సెక్రటేరియెట్ కు రాలేదన్నారు. ఆయన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి కూడా రావడం లేదన్నారు. ‘‘కేసీఆర్ ధర్నాచౌక్ ఎత్తేశారు. కానీ మేం ఆ ధర్నాచౌక్ ను రీఓపెన్ చేస్తే.. అక్కడే కేటీఆర్, హరీశ్ రావు ధర్నాలు చేస్తున్నారు. వారానికి రెండుసార్లు వాళ్లు ధర్నా చేస్తున్నారంటే మేం ఎంతటి ప్రజాస్వామ్యం తెచ్చాం’’ అని అన్నారు.  ‘‘తెలంగాణ ఉద్యమం టైమ్ లో స్టూడెంట్లు, ఇండస్ట్రియలిస్టులు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ తో నేను కూడా మద్దతు ఇచ్చాను. అందరిలాగే కేసీఆర్ కు ఫైనాన్స్ చేశాను. కానీ ఏనాడు బీఆర్ఎస్ తో పని చేయలేదు. టీడీపీతోనే కలిసి పని చేశాను” అని చెప్పారు.  

కేటీఆర్​పై విచారణకు గవర్నర్ అనుమతి కోరాం

కేసీఆర్ కుటుంబ అవినీతిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అనుమతి కోరామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఆ ఫైల్ 15 రోజులుగా గవర్నర్ ఆఫీసులోనే ఉందని చెప్పారు. ‘‘బీజేపీ, బీఆర్ఎస్ సిబ్లింగ్స్. ముందట తిట్టుకుంటారు.. వెనకాల మాట్లాడుకుంటారు. ఫార్ములా–ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ప్రశ్నించేందుకు ఏసీబీ గవర్నర్ పర్మిషన్ కోరగానే  కేటీఆర్ ఢిల్లీకి వచ్చారు” అని పేర్కొన్నారు. ‘‘గతంలో మహారాష్ట్రలో బీఆర్ఎస్ జాయినింగ్స్ పేరుతో కేసీఆర్ హడావుడి చేశారు. మరి ఇప్పుడెందుకు ఎన్నికల్లో ఒక్కరిని కూడా నిలబెట్టలేదు? 

జాతీయ పార్టీగా ఎదిగేందుకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చామన్న కేసీఆర్... మళ్లీ మహారాష్ట్రకు ఒక్కసారైనా ఎందుకు రాలేదు. ఎన్నికల్లో పోటీ చేయడం పక్కనపెడితే.. మోదీకి వ్యతిరేకంగా ఒక్క స్లోగన్ అయినా ఇచ్చారా? బీజేపీ, కాంగ్రెస్ ను ఓడించాలనేదే ఆయన ఆలోచన అయితే... మిత్రుడు శరద్ పవార్ వర్గం కోసమైనా ప్రచారం చేయొచ్చుగా! కేసీఆర్ ఇవేమీ చేయడం లేదంటే దీని వెనుక బీజేపి, బీఆర్ఎస్ ఒప్పందం ఉందని స్పష్టంగా అర్థం అవుతున్నది” అని అన్నారు.