మహారాష్ట్రలోని ‘పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ)’ బ్యాంక్‌లో ఫ్రాడ్ బయటపడి దాదాపు రెండు నెలలు కావస్తోంది. బ్యాంక్‌లో డబ్బు దాచుకున్న డిపాజిటర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన భరోసా లభించక ధైర్యం కోల్పోయి ఇప్పటివరకు 10 మంది చనిపోయారు. కష్టపడి కూడబెట్టిన పైసా పైసా ఇప్పుడు బ్యాంక్‌లో చిక్కుపడిపోయింది. సొమ్ములు చేతికొచ్చే దారిలేక వాళ్ల ఫ్యామిలీలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చి సుమారు నెలరోజులవుతున్నా సర్కారు ఏర్పడకపోవటంతో బాధితులు ఎవరికి మొరపెట్టుకోవాలో తెలీని అయోమయంలో పడ్డారు.
డిపాజిట్ చేసిన డబ్బుకి మ్యాగ్జిమం రూ.లక్ష వరకు సెక్యూరిటీ కల్పించేందుకు ప్రస్తుతం ఇన్సూరెన్స్ స్కీమ్ అమల్లో ఉంది. ఒక వ్యక్తి మల్టిపుల్ డిపాజిట్లు చేసినా ఒక్క డిపాజిటర్గానే పరిగణించి బీమా చెల్లిస్తారు. పీఎంసీ బ్యాంక్‌ని మరో బ్యాంక్‌లో విలీనం చేసినా ఇన్సూరెన్స్ వర్తించేలా రూల్స్ పెట్టారు. అయితే, పీఎంసీ బ్యాంక్‌లో ఊహించని విధంగా స్కామ్ జరగటంతో బీమా సీలింగ్‌ని పెంచాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఎన్నో ఏళ్ల కిందట విధించిన ఈ లక్ష రూపాయల లిమిట్‌ని ఇప్పటికీ కొనసాగించటం సరికాదని అభిప్రాయపడుతున్నారు. స్కామ్‌పై లోతుగా విచారణ జరిపి దోషులను గుర్తించి శిక్షలు పడేలా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు చూస్తారు.
ఇదంతా జరిగే లోపు అకౌంట్ హోల్డర్ల ఆర్థిక సమస్యల్ని తక్షణం తీర్చేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సోషల్ యాక్టివిస్టులు సూచిస్తున్నారు. వాళ్ల ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకోవాలి. పీఎంసీ బ్యాంక్ ఇచ్చిన షాక్ ప్రభావం ఇతర బ్యాంకుల కస్టమర్లనూ వెంటాడుతోంది. ప్రజల్లో నెలకొన్న ఈ భయాన్ని తొలగించకపోతే బ్యాంకింగ్ వ్యవస్థపైనే నమ్మకం పోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తన కమిట్మెంట్లను నిలబెట్టుకోలేక డిఫాల్ట్ కావటంతో ప్రభుత్వమే జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు.
నమ్మకం పోతే అంతే సంగతలు
బ్యాంక్, ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసుల్లో సూపర్విజన్ మెకానిజం పూర్తిగా ఫెయిల్ అయినట్లు క్లియర్‌గా తెలుస్తోందని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్‌లు అంటున్నారు. బ్యాంకులను, ఫైనాన్షియల్ సంస్థల్ని కట్టుదిట్టంగా కంట్రోల్ చేయటానికి ఇకనైనా కొత్త రూల్స్‌కి, ఇన్వెస్టిగేషన్స్కి రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు. పీఎంసీ లాంటి ఎపిసోడ్లు ప్రజలకు క్రమంగా బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం పోయేలా చేస్తాయి. అధిక సేవింగ్స్ రేటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్‌లోని బలమైన అంశమనే ప్రచారం చానాళ్లుగా కొనసాగుతోంది. కానీ.. అది సరికాదని అంటున్నారు. బ్యాంకులను, ఎల్ఐసీ వంటి సంస్థలను జనం ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఎప్పుడూ నమ్మకానికి మారు పేరుగా భావిస్తున్నారు. ఈ నమ్మకం ఒక్క రోజులో సంపాదించింది కాదు. కొన్నేళ్లుగా కష్టపడి సాధించింది. ఇంతటి విలువైన విశ్వాసాన్ని పోగొట్టుకోవటానికి ఏళ్లు కాదు. రోజులు చాలు. డబ్బుల్ని బ్యాంకుల్లో వేసినా సెక్యూరిటీ లేదని జనం భావిస్తే బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలుతుందని ఆర్థికరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
