ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ టూర్ ఖరారైంది. మార్చి 17న మోదీ ఏపీలో పర్యటించనున్నారు. చిలకలూరిపేటలో టీడీపీ, బీజేపీ, జనసేనల ఉమ్మడి బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు. పొత్తు తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికల బహిరంగ సభ కావడంతో మూడు పార్టీలు ఈ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
సభ ఏర్పాట్లను టీడీపీ నేత లోకేశ్ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. సభను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన మూడు పార్టీల ముఖ్య నేతలతో 13 కమిటీలను ఏర్పాటు చేశారు. చిలకలూరి పేట సభ ద్వారా మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. సరిగ్గా పదేళ్ల క్రితం 2014 ఎన్నికల ప్రచారంలో ఈ ముగ్గురు కలిసి ఒకే వేదిక పంచుకున్నారు. తిరిగి పదేళ్ల తరువాత మళ్లీ ఈ దృశ్యం కనిపించనుంది.
మరోవైపు మూడు రోజులు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 16,18,19 తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిర్వహించే సభల్లో మోదీ పాల్గొని, ప్రసంగించనున్నారు. ఒక్కోరోజు రెండు, మూడు పార్లమెంట్ స్థానాలను కలుపుతూ ఒక్కో సభ పెట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. మల్కాజిగిరి, జగిత్యాల, నాగర్ కర్నూల్ లో సభలు పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. అయితే, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తేనే.. ఈ తేదీల్లో సభలు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ షెడ్యూల్ ఆలస్యమైతే.. మోదీ టూర్ తేదీలు మారే చాన్స్ ఉందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.