గ్రూపులు కట్టొద్దు... రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

  • అధికారంలోకి రాకపోవడానికి గ్రూపులే కారణమని ఫైర్ 
  • ఇకనైనా ఒకరిపై ఒకరు కుట్రలు చేయడం,గోతులు తవ్వుకోవడం ఆపాలని హెచ్చరిక
  • 30 నిమిషాల మీటింగ్​లో20 నిమిషాలు క్లాస్

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలకాలని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోవడానికి గ్రూపులే కారణమని మండిపడ్డారు. ‘‘గ్రూపులుగా విడిపోయి కార్యకర్తలను ఆగం చేయొద్దు. ఇకనైనా ఒకరిపై ఒకరు కుట్రలు చేయడం, గోతులు తవ్వుకోవడం ఆపండి. అందరూ వ్యక్తిగత అజెండాలు పక్కనపెట్టి, పార్టీ స్టాండ్​లో కలిసికట్టుగా ముందుకు సాగండి. హైకమాండ్ ఇచ్చే సలహాలు, సూచనలు అమలు చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయండి” అని దిశానిర్దేశం చేశారు.

బుధవారం పార్లమెంట్ లోని తన చాంబర్ లో రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలను ఒక్కొక్కటిగా ప్రస్తావించారు. పార్టీలో గ్రూపులు ఏర్పడడం, నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతోనే ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడిని మార్చాల్సి వచ్చిందని మోదీ చెప్పినట్టు తెలిసింది. అయితే గ్రూపు రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయని, ఇలాంటి తీరు సరికాదని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

నేతలంతా ఏం చేస్తారో తనకు తెలియదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలని టార్గెట్ పెట్టారు. కాగా, మధ్యాహ్నం 12 నుంచి 12:30 గంటల వరకు నేతలతో సమావేశమైన మోదీ.. అందులో 20 నిమిషాలు వాళ్లకు క్లాస్ తీసుకునేందుకే కేటాయించినట్టు తెలిసింది. సాధారణంగా తక్కువ మాట్లాడి, ఎక్కువ వినేందుకు ఇష్టపడే ఆయన.. ముఖ్య నేతల్లో సమన్వయ లేమి, పార్టీకి జరిగిన నష్టం, కార్యకర్తల్లో నెలకొన్న గందరగోళంపై వివరిస్తూ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. 

ప్రజా సమస్యలపై పోరాడండి.. 

బీజేపీ హైకమాండ్ కేవలం వ్యూహాలు, కావాల్సిన సపోర్ట్ మాత్రమే ఇస్తుందని.. క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్టం చేసేది రాష్ట్ర నాయకులేనని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. అయితే తెలంగాణ నేతల మధ్య నెలకొన్న వ్యక్తిగత విభేదాలు రాష్ట్రంలో పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చుతున్నాయని మండిపడ్డారు. ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కీలక నేతల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు కలసికట్టుగా పని చేయడంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని వివరించారు. ‘‘అభివృద్ధి చేయాలంటూ విజ్ఞప్తులు ఇవ్వడమే కాదు.. ప్రజా సమస్యలపైనా పోరాడండి. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండి. బీజేపీకి తెలంగాణలో ఇంకా మంచి ఆదరణ ఉన్నదని నా సర్వే రిపోర్టులో తేలింది. కుటుంబ పాలన, అహంకారం, అవినీతి బీఆర్ఎస్ పార్టీని ముంచేశాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ప్రజల్లో రోజురోజుకు విశ్వాసం, నమ్మకం సన్నగిల్లుతున్నది.

అందువల్ల రాష్ట్రంలో బీజేపీకి మంచి స్కోప్ ఉంది. ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీని, క్యాడర్ ను బలోపేతం చేయండి. నేతల మధ్య గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టండి” అని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడెం నగేశ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, రాకేశ్ రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, రామారావు పటేల్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా, నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పనులు, కేంద్ర సాయానికి సంబంధించిన విజ్ఞప్తుల ఫైల్ ను ప్రధాని మోదీకి డీకే అరుణ అందజేశారు. 

అందుకే మీటింగ్​కు ఇంత టైమ్.. 

నిజానికి కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి పార్లమెంట్ సెషన్ లోనే రాష్ట్ర నేతలు ప్రధాని అపాయిట్ మెంట్ కోరారు. అయితే రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పార్టీలో గ్రూపు రాజకీయాల గురించి తెలుసుకోడానికే ఇంతకాలం ఆయన అపాయిట్మెంట్ ఇవ్వలేదని తెలిసింది. ముఖ్యంగా గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఖాయమని భావించినా 8 సీట్లకే పరిమితం కావడంతో.. అందుకు గల కారణాలపై సంఘ్ పరివార్ నుంచి కూడా సమాచారం తెలుసుకున్నట్టు  తెలిసింది.

ఈ డేటా సేకరించిన తర్వాత నేతలకు క్లాస్ తీసుకునేందుకే ప్రధాని ఈ మీటింగ్ నిర్వహించినట్టు అందులో పాల్గొన్న పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. కాగా, కొందరు ఎమ్మెల్యేలు మాత్రం మోదీ మీటింగ్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదో కాదనలేక ఈ సమావేశం ఏర్పాటు చేశారని మీడియాతో పేర్కొన్నారు. 

అభివృద్ధి పనులపై ఆరా తీశారు: కిషన్ రెడ్డి 

ప్రజా సమస్యలపై పోరాడాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారని కేంద్రమంత్రి, స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. ప్రోయాక్టివ్ గా ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. ‘‘గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ అపాయిట్ మెంట్ కోసం రిక్వెస్ట్ చేస్తే బుధవారం టైమ్ ఇచ్చారు.

ఈ మీటింగ్ లో 8 మంది ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక ఎమ్మెల్సీ పాల్గొన్నారు” అని వివరించారు. కూతురి వివాహ పనులు ఉన్నందున బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరుకాలేదని చెప్పారు.