ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు. 2024 మార్చి 17 ఆదివారం ఎన్డీఎ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభకు (ఎన్నికల ప్రచార కార్యక్రమ నిమిత్తం) వాడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ప్రభుత్వ వాహనాలు రాజకీయ ప్రయోజనాలకు, ఎన్నికల ప్రచారాలకు వాడటం ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు సోమశేఖర్ తన ఫిర్యాదులో తెలిపారు.
సోమశేఖర్ తో పాటు గొంది సురేష్, శివకార్తీక్, శ్రీనివాసరావు తదితరులు కూడా ఫిర్యాదులో ఈ ఘటనను ఖండించారు. దీనిపై తక్షణమే విచారణ చేపట్టి.. తగు చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాని కోరారు.