దేశ రాజధాని ఢిల్లీలోకి ఎంటర్ అయిన నమో భారత్​ ట్రైన్

  • ఢిల్లీకి నమో భారత్​ ట్రైన్​ ఆర్ఆర్​టీఎస్​ కారిడార్​ను ప్రారంభించిన ప్రధాని మోదీ
  • సాహిబాబాద్​ నుంచిన్యూ అశోక్​నగర్​ వరకు రైడ్​
  • ప్రయాణంలో ప్రజలు, చిన్నారులతో మోదీ ముచ్చట్లు
  • రోహిణి​ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోకి నమో భారత్​ ట్రైన్​ ఎంటర్ అయింది.  ఢిల్లీ–ఘజియాబాద్​–మీరట్​ నమో భారత్​ కారిడార్​ను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఇది ఉత్తరప్రదేశ్​లోని సాహిబాబాద్, ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ రీజినల్ ​ర్యాపిడ్​ ట్రాన్సిట్​ సిస్టమ్​(ఆర్ఆర్​టీఎస్)​ కారిడార్​లో 13 కిలోమీటర్ల అదనపు సెక్షన్​ను ఓపెన్​ చేశారు. హిండన్ ఎయిర్‌‌ బేస్ నుంచి సాహిబాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ, ఈ నమో భారత్ మెట్రో లైన్​ను జాతికి అంకితం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సాహిబాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు నమో భారత్ రైల్లో  ప్రయాణించారు. చిన్నారులు వేసిన పెయింటింగ్స్‌‌ ను చూసి అభినందించారు. కాగా, ఆర్ఆర్ టీఎస్ ప్రారంభంతో మీరట్​ సిటీ ఇప్పుడు ఢిల్లీతో డైరెక్ట్​గా కనెక్ట్​ అయింది. ఢిల్లీ నుంచి మీరట్​కు ఇప్పుడు కేవలం 40 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. కొత్తగా ప్రారంభించిన నమో భారత్​ రైలు 13 కి.మీ.విభాగంలో 6 కి.మీ. మేర భూగర్భంలో నడవనున్నట్టు అధికారులు చెప్పారు. నమో భారత్ రైళ్లు భూగర్భ విభాగంలో నడపడం ఇదే తొలిసారని వెల్లడించారు.
 
జనక్‌‌పురి వెస్ట్-కృష్ణా మెట్రో ప్రారంభం 
ఢిల్లీ మెట్రో ఫేజ్​4లోని జనక్​పురి వెస్ట్​ కృష్ణా పార్క్​ ఎక్స్​టెన్షన్​ విభాగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే, రిథాలా–నరేలా–కుండి కారిడార్​కు శంకుస్థాపన చేశారు. జనక్​పురి వెస్ట్​ క్రిష్ణ పార్క్​ ఎక్స్​టెన్షన్​ సెక్షన్​​ అనేది ఢిల్లీ మెట్రో ఫేజ్​4లోని మొదటి దశ. దీంతో ఢిల్లీ మెట్రో నెట్‌‌వర్క్ ఇప్పుడు 394.448 కిలో మీటర్ల విస్తీర్ణంలో 289 స్టేషన్లను కలిగి ఉంది. కాగా, కొత్తగా నిర్మించిన జమ్మూ రైల్వే డివిజన్​ను ప్రధాని మోదీ సోమవారం వర్చువల్​గా ప్రారంభించనున్నారు.

అధికారంలోకి వస్తే స్కీమ్స్ ​కొనసాగిస్తం..
ఢిల్లీలోని ఆప్​ సర్కారు.. కేంద్రంతో కొట్లాడుతూ దశాబ్ద కాలాన్ని వృథా చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ పదేండ్ల కాలంలో ఢిల్లీలో అభివృద్ధి పట్టాలు తప్పిందన్నారు. ఆమ్​ ఆద్మీ సర్కారుతో ఢిల్లీ ప్రజలు విసిగిపోయారని, ఢిల్లీని అభివృద్ధి బాటలో నడిపే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఆప్.. ప్రజా వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తే.. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నగరంగా ఢిల్లీని డెవలప్​చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను నిలిపివేయబోమని, అందులో అవినీతిని తొలగిస్తామని అన్నారు. ఆప్​ సర్కారు ఢిల్లీని తాకిన విపత్తు అని విమర్శించారు. ‘‘ఢిల్లీలో విపత్తు(ఆప్​) తొలగిపోయినప్పుడే అభివృద్ధి అనే డబుల్​ఇంజిన్​ వస్తుంది” అని పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర సర్కారు హైవేలను డెవలప్​ చేస్తున్నదని, మెట్రో నెట్​వర్క్​ను విస్తరిస్తున్నదని, నమో భారత్​ ఆర్ఆర్​టీఎస్​ను ప్రారంభించిందని, పెద్ద దవాఖానలను నడుపుతున్నదని చెప్పారు.

కేజ్రీవాల్కు ప్రజల బాధలు పట్టవు
కొవిడ్​–19 సమయంలో ప్రజలంతా బాధపడుతున్నప్పుడు.. ఆక్సిజన్, మెడిసిన్​ కోసం కష్టపడుతున్నప్పుడు.. కేజ్రీవాల్​ తన శీష్​​మహల్ నిర్మాణంలో బిజీగా ఉన్నారని మోదీ మండిపడ్డారు. శీష్​మహల్​కు భారీ బడ్జెట్ కేటాయించుకున్నారు, కానీ.. ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. తాము ఇలాంటి చర్యలను సహించబోమని, మార్పు తీసుకొచ్చి తీరుతామని చెప్పారు. ఢిల్లీలో బీజేపీ త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు వచ్చిన ఆపదను దూరం చేయడానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామని మోదీ తెలిపారు.