ఇండో పసిఫిక్ లో కలిసికట్టుగా ముందుకెళదాం

ఇండో పసిఫిక్ లో కలిసికట్టుగా ముందుకెళదాం
  • క్వాడ్ కంట్రీస్ వర్చువల్ సదస్సులో మోడీ 
  • వసుధైక కుటుంబానికి పొడిగింపే క్వాడ్​ గ్రూప్​ అన్న ప్రధాని 

న్యూఢిల్లీ: ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, భద్రత, స్థిరత్వం కోసం కలిసికట్టుగా ముందుకు వెళదామని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం జరిగిన క్వాడ్ కంట్రీస్ మొదటి వర్చువల్ సమిట్ లో ప్రధాని మోడీ, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ పీఎం యోషిహిడే సుగా పాల్గొన్నారు. నాలుగు దేశాలు డెమొక్రటిక్ వ్యాల్యూస్ తో ఒక్కటయ్యాయని మోడీ అన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వానికి క్వాడ్ దేశాలు ముఖ్యమైన పిల్లర్ గా నిలుస్తాయని చెప్పారు. ‘‘ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, అభివృద్ధి కోసం ఒకేతాటిపైకి వచ్చాం. వ్యాక్సిన్స్, క్లైమేట్ చేంజ్, కొత్త టెక్నాలజీల వంటి మన ఎజెండా క్వాడ్ గ్రూపును ప్రపంచం ముందు ఒక మంచి శక్తిగా నిలబెడతాయి. ప్రపంచమంతా ఒకటే కుటుంబం (వసుధైక కుటుంబం) అన్న ఇండియన్ ఫిలాసఫీకి పొడిగింపు రూపమే ఈ పాజిటివ్ విజన్” అని మోడీ అన్నారు. 
 

బెదిరింపులకు నో ప్లేస్: బైడెన్ 
అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్ తొలిసారి ప్రధాని మోడీతో వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ రీజియన్ లో మన అందరి భవిష్యత్తు, సహకారం కోసం క్వాడ్ గ్రూపు కీలక వేదికగా నిలుస్తుందన్నారు. ఎలాంటి బెదిరింపులకు ఇక్కడ తావు లేదు అని ఆయన పరోక్షంగా చైనాను హెచ్చరించారు. 

 

క్వాడ్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ కు ఓకే
క్వాడ్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్​కు నాలుగు దేశాలూ అంగీకరించాయి. అమెరికాలో వ్యాక్సిన్ లను అభివృద్ధి చేయడం, వాటిని ఇండియాలో తయారు చేయడం, జపాన్, అమెరికా నిధులు సమకూర్చడం, అన్నింటికీ ఆస్ట్రేలియా సహకారం అందించడంపై చర్చించారు. కాగా, చైనాకు కౌంటర్​గా క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్వాడ్) గ్రూపును 2007లోనే ఏర్పాటు చేశారు.  అయితే ఇండో పసిఫిక్ రీజియన్ లో ఇటీవల చైనా దూకుడు పెంచడంతో..  2017లో దానిని మళ్లీ యాక్టివ్ చేశారు.