ఏపీ అభివృద్ధే మా విజన్.. ఏపీ ప్రజల సేవే మా సంకల్పం: ప్రధాని మోడీ

విశాఖ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా విజన్.. ఏపీ ప్రజల సేవే మా సంకల్పమని ప్రధాని మోడీ అన్నారు. మీ ఆశీర్వాదంతో 60 ఏళ్ల తరువాత కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చామని.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీపై అభిమతం చూపే అవకాశం ఇప్పుడు వచ్చిందని..  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు మేం ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీలో పర్యటిస్తోన్న ప్రధాని మోడీ.. బుధవారం (జనవరి 8) విశాఖలో రూ.2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్‎గా శంఖుస్థాపన చేశారు. అనంతరం విశాఖలోని ఏయూలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మోడీ ప్రసంగించారు. లక్షల కోట్ల పథకాలతో ఏపీ అభివృద్ధికి కేంద్రం మద్దతుగా ఉంటుందని.. ఏపీ 2.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుందని.. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం అయ్యి తీరుందని మోడీ వ్యాఖ్యానించారు. 

ALSO READ | రాసి పెట్టుకోండి.. ఢిల్లీలో కూడా బీజేపీదే విజయం: సీఎం చంద్రబాబు

రాష్ట్ర ప్రజలు తమపై పెట్టుకున్న విశ్వాసాన్ని భగ్నం చేయబోమని హామీ ఇచ్చారు. ఐటీ, సాంకేతికతకు ఏపీ కేంద్రంగా మారిందని..  ప్రపంచంలోని టాప్ నగరాల్లో ఒకటిగా విశాఖ మారుతోందని జోస్యం చెప్పారు. దేశంలో రెండు గ్రీన్ ఎనర్జీ హాబ్‎లు ఉండగా.. అందులో ఒకటి ఏపీలోనే పూడిమడకలో ఉందని తెలిపారు. 2030 నాటికి5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇవాళ రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏపీలో ప్రారంభిస్తున్నామని.. ఇది ఏపీకే కాకుండా యావత్ దేశానికి కూడా అభినందనీయమని అన్నారు.