దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసిన గొప్ప వ్యక్తి.. మన్మోహన్ సింగ్‎కు PM మోడీ నివాళులు

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రధాని మోడీ నివాళులర్పించారు. శుక్రవారం (డిసెంబర్ 27) మన్మోహన్ నివాసానికి వెళ్లిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా మన్మోహన్ సింగ్ భౌతికాయంపై పుష్పగుచ్చం పెట్టి నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాని మోడీ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. 

ఆర్థిక వేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్‎ను దేశం మొత్తం గుర్తిస్తోందన్నారు. ఆర్బీఐ సహా ఎన్నో కీలక పదవుల్లో ఆయన సేవలు అందించారని కొనియాడారు. పీవీ నర్సింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మన్మోహన్ సింగ్ పూర్తిగా మార్చేశారని గుర్తు చేశారు. దేశం, సేవ పట్ల ఆయన సేవాభావం స్మరించదగినదని పేర్కొన్నారు. విలక్షణ పార్లమెంటేరియన్‎గా మన్మోహన్ సింగ్ సేవలు అందించారు. 

Also Read :- డిసెంబర్ 28న మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు

ఎన్నో కీలక పదవులు అధిష్టించిన ఆయన సామాన్య జీవితం గడిపారని ప్రశంసించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై మన్మోహన్ సింగ్‎తో ఎన్నోసార్లు మాట్లాడానని తెలిపారు. నా తరుఫున, దేశ ప్రజల తరుఫున మన్మోహన్ సింగ్ మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తు్న్నానని అన్నారు. కాగా, అనారోగ్యంతో 2024, డిసెంబర్ 26వ తేదీన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన విషయం తెలిసిందే. 

మన్మోహన్ సింగ్ భౌతికాయాన్ని సందర్శనార్థం ఢిల్లీలోని ఆయన నివాసానికి తరలించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న మన్మోహన్ సింగ్ కుమార్తె ఇవాళ (డిసెంబర్ 27) తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత.. 2024, డిసెంబర్ 28న అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.