5జీతో దేశం పరుగులు పెడుతోంది

5జీతో దేశం పరుగులు పెడుతోంది

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో దేశం వడివడిగా ముందుకెళుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అవినీతి మురికి నుంచి అభివృద్ధిలోకి వచ్చిన టెలికాం సెక్టార్..  స్వయంసమృద్ధికి సరైన నిర్వచనంగా నిలిచిందని చెప్పారు. మంగళవారం జరిగిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్​ ఇండియా(ట్రాయ్) సిల్వర్​ జూబ్లీ వేడుకల్లో ప్రధాని వర్చువల్​గా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఐఐటీ మద్రాస్​ ఆధ్వర్యంలో 8 ఇనిస్టిట్యూట్​లు కలిసి డెవలప్​ చేసిన 5జీ టెస్ట్​బెడ్​ను ప్రధాని ప్రారంభించారు. ట్రాయ్​ వేడుకలకు హాజరైన వారిని ఉద్దేశించి మోడీ మాట్లాడారు. 2జీ కాలంలో అవినీతి వల్ల దేశం ఓ దశాబ్దం వెనకబడిందని పరోక్షంగా కాంగ్రెస్​ను విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక 3జీ నుంచి దేశాన్ని 4జీలోకి నడిపించామని చెప్పారు. ఇప్పుడు 5జీ లోకి అడుగుపెట్టామని, ఇది దేశాన్ని అభివృద్ధిబాటలో పరుగులు పెట్టిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. పరిపాలనలో కూడా 5జీ టెక్నాలజీ మంచి మార్పులు తీసుకొస్తుందని, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య తదితర రంగాల అభివృద్ధికి తోడ్పడుతుందని మోడీ వివరించారు. ఈ కొత్త టెక్నాలజీతో దేశంలో ఉద్యోగ అవకాశాలూ పెరుగుతయని చెప్పారు. 5జీ టెక్నాలజీతో దేశ ఆర్థిక వ్యవస్థకు 45 వేల కోట్ల డాలర్ల సహకారం అందుతుందని ప్రధాని తెలిపారు. ఈ దశాబ్దం చివరి నాటికి 6 జీ సేవలు ప్రారంభించాలని కోరుకుంటున్నామని, ఇప్పటికే దానికోసం ప్రయత్నాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​పాల్గొన్నారు. ట్రాయ్​ సిల్వర్​ జూబ్లీ వేడుకల్లో భాగంగా పోస్టల్​ స్టాంప్​ను విడుదల చేశారు.