త్వరలోనే భారత్ కు బుల్లెట్ రైలు సాకారం అవుతుంది: ప్రధాని మోడీ

చర్లపల్లి రైల్వే టర్మినల్ ను వర్చువల్ గా ప్రారంభించారు పీఎం మోడీ. సోమవారం ( జనవరి 6, 2025 ) ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. దేశంలో మెట్రో వెయ్యి కిలోమీటర్లు దాటిందని.. కోట్లాదిమంది ప్రజలకు మెట్రో సేవలు అందిస్తోందని అన్నారు. ప్రతి రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరుగుతోందని.. దేశంలో కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని,త్వరలోనే భారత్ కు బుల్లెట్ రైలు సాకారం అవుతుందని అన్నారు ప్రధాని మోడీ.

వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకెళ్తున్నామని... నాలుగు విభాగాల్లో రైల్వేను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మౌలిక వసతులు, ప్రయాణికుల సదుపాయాలు, మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ, ఉపాధి కల్పన కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భారత రైల్వేకు బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నామని.. కోట్లాది మందిని వందే భారత్ రైళ్లు గమ్యం చేరుస్తున్నాయని అన్నారు. 180 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ స్లీపర్ కోచ్ ట్రయిల్ రన్ నడిచిందని అన్నారు మోడీ.

సోలార్ స్టేషన్ గా చర్లపల్లి టర్మినల్ ను అభివృద్ధి చేశారని.. ఔటర్ రింగ్ రోడ్డుకు ఇది  సమీపంలో ఉందని అన్నారు మోడీ. తెలంగాణ ప్రగతిలో చర్లపల్లి రైల్వే టర్మినల్ అత్యంత కీలకంగా మారబోతోందని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా చర్లపల్లి లాంటి స్టేషన్లు అవసరమని అన్నారు.