రిటైల్, హోల్‌సేల్ ట్రేడర్లుకు కేంద్రం గుడ్‌ న్యూస్

రిటైల్, హోల్‌సేల్ ట్రేడర్లుకు కేంద్రం గుడ్‌ న్యూస్
  • ‘ఎంఎస్ఎంఈ’ పరిధిలోకి తెచ్చిన సెంట్రల్ సర్కారు
  • ఇదో ల్యాండ్‌మార్క్ నిర్ణయమన్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: రిటైల్, హోల్ సేల్ ట్రేడర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. ఈ రంగాలను మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌‌ప్రైజెస్‌ (ఎంఎస్ఎంఈ) పరిధిలో గుర్తిస్తూ  నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ప్రకటించారు. ఈ నిర్ణయంతో రిటైల్, హోల్ సేల్ ట్రేడర్లకు ఆర్బీఐ గైడ్‌ లైన్స్ ప్రకారం ఎంఎస్ఎంఈలు పొందే తక్కువ వడ్డీ, సబ్సిడీ లోన్లలో ప్రయారిటీ దక్కనుంది. దీని ద్వారా వారి వ్యాపారాలను మరింత డెవలప్ చేసుకోవచ్చు. చిన్న రిటైల్ వ్యాపారులు, రూ.250 కోట్ల టర్నోవర్ వరకూ ఉండే హోల్ సేలర్ల వరకూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కరోనా కారణంగా ప్రకటించిన ఆత్మ నిర్భర్ ప్యాకేజీ ద్వారా మేలు జరగనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడంతో పాటు, బిజినెస్‌లు డెవలప్ చేసుకునేందుకు తక్కువ వడ్డీతో కూడిన లోన్లు ఈ ప్యాకేజీ కింద అందనున్నాయి.
ప్రధాని మోడీ ట్వీట్
రిటైల్, హోల్ సేల్ ట్రేడ్‌ రంగాలను ఎంఎస్ఎంఈ పరిధిలో గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆ రంగాల అభివృద్ధిలో ఓ మైలురాయిగా ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రిటైల్, హోల్ సేల్ ట్రేడర్లు ఈజీగా ఫైనాన్స్ పొందగలుగతారని, అలాగే వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు చాలా బెనిఫిట్స్ అందుతాయని, ట్రేడర్స్‌కు సాధికారత కల్పించడానకి తమ ప్రభుత్వం  కృషి చేస్తోందని ఆయన ట్వీట్ చేశారు.