హైదరాబాద్, వెలుగు: అపార్ట్‌మెంట్‌లు కొనడం కంటే ప్లాట్‌లు (ల్యాండ్) తీసుకోవడం వలన ఎక్కువ లాభం వస్తోందని హౌసింగ్ డాట్ కామ్ ప్రకటించింది. 2015 నుంచి చూస్తే , దేశం మొత్తం మీద ప్లాట్ల ధరలు సగటున ఏడాదికి 7 శాతం పెరిగాయని, అదే అపార్ట్‌మెంట్ల ధరలు కేవలం 2 శాతం మాత్రమే పెరిగాయని వివరించింది. సౌత్ ఇండియాలో ప్లాట్ల రేట్లు ఎక్కువగా పెరుగుతున్నాయని పేర్కొంది. హైదరాబాద్ మార్కెట్‌లో 2018–21 మధ్య ప్లాట్ల రేట్లు ఏడాదికి 21 శాతం పెరిగాయని పేర్కొంది. సిటీకి పశ్చిమాన ఉన్న శంకర్‌పల్లి, పటాన్‌చెరు దగ్గర్లో, సౌత్‌లోని తుక్కుగూడ, మహేశ్వరం, షాద్‌నగర్ ఏరియాల్లో ప్లాట్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని, ఇక్కడ రేట్లు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయని వివరించింది. ‘రెసిడెన్షియల్ ప్లాట్లలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. దీనికి పెద్ద సిటీలలో ప్లాట్ల కొరత ఉండడం ఒక కారణం’ అని హౌసింగ్ డాట్ కామ్ సీఈఓ ద్రువ్ అగర్వాల అన్నారు. కరోనా టైమ్‌లో ప్లాట్లకు, ఇండిపెండెంట్ ఫ్లోర్లకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. ఈ డిమాండ్‌ను చేరుకోవడానికి పెద్ద సిటీలకు అవుట్‌స్కర్ట్స్‌లో కొత్త ప్రాజెక్ట్‌లను డెవలపర్లు లాంచ్ చేస్తున్నారని అన్నారు. కాగా, హైదరాబాద్, ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, పుణె, బెంగళూరు, కోల్‌కత, చెన్నై, అహ్మదాబాద్‌లోని ప్రజలు సాధారణంగా ప్లాట్ తీసుకోవడం కంటే అపార్ట్‌మెంట్ తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని హౌసింగ్ డాట్ కామ్ సర్వే వెల్లడించింది.
