- పీఎల్‌ఐ కింద అందజేస్తామన్న ప్రభుత్వం
- లోకల్ మెటీరియల్ కొంటే మరిన్ని ఇన్సెంటివ్‌లు
- ప్రకటించిన కేంద్రమంత్రి ఆర్‌కే సింగ్
న్యూఢిల్లీ: సోలార్ కరెంటు తయారీని పెంచడానికి భారీ ఎత్తున డబ్బు ఖర్చు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లోకల్‌గా పీవీ సోలార్ మాడ్యూళ్ల తయారీ కెపాసిటీని పెంచేందుకు మొదలుపెట్టిన పిఎల్‌ఐ పథకానికి నిధులను మరింత పెంచామని తెలిపింది. దీనికింద అందజేసే రాయితీల విలువను రూ.24 వేల కోట్లకు పెంచామని కేంద్ర పవర్, న్యూ, రిన్యువబుల్ ఎనర్జీశాఖల మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు. పీవీ సోలార్ మాడ్యూళ్ల ఎగుమతులను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇండియాలో ప్రస్తుతం సోలార్ మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ కెపాసిటీ 8,800 మెగావాట్లు కాగా, సోలార్ సెల్ తయారీ కెపాసిటీ 2,500 మెగావాట్లు ఉందని పేర్కొన్నారు. "పీవీ సోలార్ మాడ్యూళ్ల తయారీని పెంచడానికి ఇది వరకే రూ. 4,500 కోట్ల విలువైన పిఎల్‌ఐ పథకాన్ని తీసుకువచ్చాం. అంతేగాక 54,500 మెగావాట్ల కెపాసిటీ కలిగిన సోలార్ మాడ్యూళ్ల తయారీ కోసం కూడా బిడ్స్ వచ్చాయి. పిఎల్‌ఐ కింద రూ. 19 వేల కోట్లు అదనంగా మంజూరు చేయాలని మాశాఖ ప్రభుత్వాన్ని కోరగా, గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పుడు పీఎల్‌ఐ కింద రూ. 24వేల కోట్ల విలువైన రాయితీలు ఇస్తాం. మనదేశం నుంచే సోలార్ పరికరాలను ఎగుమతి చేస్తాం”అని మంత్రి వివరించారు. సోలార్ పీవీ మాడ్యూళ్ల దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.4,500 కోట్ల పిఎల్‌ఐ పథకాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. రూ. 17,200 కోట్ల విలువైన డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా ఇంటిగ్రేటెడ్ సోలార్ పివి మాడ్యూల్స్ కెపాసిటీని 10 వేల మెగావాట్లకు పెంచాలనే టార్గెట్‌తో పనిచేస్తున్నామని సింగ్ ప్రకటించారు. పీఎల్‌ఐకి కేటాయింపులు రూ. 24వేల కోట్లకు పెరగడంతో పెట్టుబడులు, దేశీయ తయారీ సామర్థ్యం మరింత పెరుగుతుందన్నారు. ఎలక్ట్రిసిటీ వంటి వ్యూహాత్మక రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని వీలైనంత తగ్గించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆర్‌కే సింగ్ వివరించారు. సోలార్ పీవీ కంపెనీలను బిడ్డింగ్ ద్వారా పీఎల్‌ఐకి ఎంపిక చేస్తారు. ‘హై ఎఫీషియెన్సీ సోలార్ పీవీ మాడ్యూళ్ల’ను తయారు చేసే కంపెనీల అమ్మకాలను బట్టి ఐదేళ్ల వరకు పీఎల్‌ఐ రాయితీలను అందజేస్తారు. మాడ్యూల్ కెపాసిటీ ఎంత పెరిగితే పీఎల్‌ఐ అంతమొత్తం మొత్తం పెరుగుతుంది. సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీ కోసం లోకల్ మెటీరియల్‌ను కొన్నా రాయితీలు ఉంటాయి.
