కర్నూలు: దేశమంతా రోజు రోజుకూ విస్తరిస్తున్నకరోనా కల్లోలం సృష్టిస్తుంటే ఆంద్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన ఓ హౌస్ సర్జన్ ప్లాస్మా డొనేట్ చేసింది. ఏపీలో ప్లాస్మా డొనేట్ చేసిన మొదటి డాక్టర్ గా నిలిచింది. కర్నూలు మెడికల్ కాలేజీ విద్యార్థిని అయిన డాక్టర్ అచ్యుత గత మార్చి, ఏప్రిల్ నెలల్లో కరోనా డెలివరి వార్డు విధుల్లో డ్యూటీ చేసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో జరిగిన పొరపాటు వల్ల కరోనాకు గురైంది. కరోనా వ్యాప్తి ప్రారంభమైన మొదటి దశలోనే తనకు సోకడంతో భయపడినప్పటికీ వైద్యుడైన తండ్రి.. తల్లితోపాటు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు, వైద్యులు ధైర్యం చెప్పడంతో 14 రోజులు క్వారంటైన్ లో ఉండి కోలుకుంది.కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి విధులకు హాజరయితే బాగుంటుందనే ఆలోచన చేసింది.
డ్యూటీ కంటే ముందు ప్లాస్మా డొనేట్ చేస్తే బాగుంటుందని.. కరోనా బారిన పడి తీవ్రంగా పోరాడుతున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉందన్న వైద్యుల సూచనకు అంగీకరించింది. క్లినికల్ ట్రయల్స్ ఎన్నో రకాలుగా జరుగుతున్న తరుణంలో తాను కూడా ట్రయల్స్ లో ఎందుకు భాగం కాకూడదని భావించి ప్లాస్మా డొనేట్ చేసేందుకు రెడీ అయింది. కర్నూలు కరోనా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లాస్మా డొనేట్ చేయడంతోపాటు.. ఐసీఎంఆర్ ట్రయల్స్ కు తాను సిద్ధమేనంటూ అంగీకారం ప్రకటించింది. కరోనా బాధితులు కోలుకునేందుకు తన వంతు కృషికి ముందుకు వచ్చిన జూనియర్ డాక్టర్ అచ్యుతకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

