ఎదురుగాలులను ఎదుర్కొంటాం : కేంద్రమంత్రి పీయూష్​ గోయల్

ఎదురుగాలులను ఎదుర్కొంటాం : కేంద్రమంత్రి పీయూష్​ గోయల్

ఈసారి 12 శాతం వరకు గ్రోత్​ : పీయూష్​ గోయల్

న్యూఢిల్లీ : ముఖ్యమైన విదేశీ మార్కెట్లలో అధిక ఇన్​ఫ్లేషన్, గ్రోత్​ నెమ్మదించడం వంటి సమస్యలు ఉన్నప్పటికీ  భారత్​ నుంచి  ఎగుమతులను భారీగా పెంచుతామని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్​ సమిట్​లో ఆయన మాట్లాడుతూ, భారతదేశ సరుకుల ఎగుమతులు ఈ సంవత్సరం 10-–12శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేస్తాయని స్పష్టం చేశారు. దేశంలో ఎగుమతులు వృద్ధి మందగిస్తున్నాయి. దీంతో  కూలీలు ఎక్కువగా ఉండే టెక్స్‌‌టైల్,  తయారీ వంటి రంగాలలో ఉద్యోగాలు పోతాయనే భయాలు రేకెత్తిన నేపథ్యంలో మంత్రి ఈ కామెంట్స్​ చేశారు.

ఈ ఏడాది సెప్టెంబరులో రూపాయి విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ దిగుమతులు మోస్తరుగానే జరిగాయి. భారతదేశ సరుకుల ఎగుమతులు 19 నెలల్లో అతి తక్కువ వేగంతో పెరిగాయి. "నెలవారీ ఆటుపోట్ల గురించి వ్యాపారాలు ఎప్పుడూ భయపడవు. ఇన్​ఫ్లేషన్, రూపాయి విలువ తగ్గుదల వంటి అనేక సమస్యలకు తోడు పాశ్చాత్య దేశాల నుంచి డిమాండ్ తగ్గుతున్నది. అయినప్పటికీ భారతదేశం  సరుకుల ఎగుమతుల వ్యాపారం ఏటా 10 నుండి 12శాతం పెరుగుతుంది. మనం స్వాతంత్ర్యం పొంది 100 ఏళ్లు పూర్తయ్యే సరికి భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి” అని గోయల్ అన్నారు.

భారీగా తగ్గిన డిమాండ్​

అధిక ధరల పెరుగుదల, ఆర్థిక మాంద్యం సూచనల కారణంగా అమెరికా,  యూరోపియన్ యూనియన్‌తో సహా భారతదేశ ప్రధాన మార్కెట్‌లలో డిమాండ్ మందగించింది. ఫలితంగా ఇంజనీరింగ్, రెడీమేడ్ గార్మెంట్స్, కాటన్, నూలు, ప్లాస్టిక్స్,  లినోలియంతో సహా కీలక రంగాల ఎగుమతులు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో విపరీతంగా తగ్గాయి. మోడీ ప్రభుత్వం సంతకం చేస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఏ) గురించి గోయల్ మాట్లాడుతూ, ఎఫ్‌టీఏలపై ఇకపై సంతకాలు చేయడం లేదని, భారతదేశం  దీర్ఘకాలిక ప్రయోజనాలను జాగ్రత్తగా కాపాడుకుంటామని అన్నారు.

"మనకు న్యాయం చేయని వాణిజ్య ఒప్పందం గురించి గతంలో చర్చలు జరిగాయి. మా ప్రభుత్వం చర్చలను కొనసాగిస్తుంది. మేం ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్​సీఈపీ)పై సంప్రదింపులను కొనసాగిస్తున్నాం. అయితే మన ఎంఎస్​ఎంఈ,  డెయిరీ రంగాలు ఈ ఒప్పంద ప్రభావం గురించి భయపడుతున్నాయి. ఇండియా ఆర్​సీఈపీ నుండి వైదొలగడానికి కారణం చైనా–-ఇండియా ఫ్రీ ట్రేడ్​ అగ్రిమెంట్” అని మంత్రి అన్నారు. అమెరికాతో ఎఫ్‌టీఏపై అడిగిన ప్రశ్నకు గోయల్ స్పందిస్తూ, ప్రస్తుతం అమెరికా సహా ఎవరితోనూ ఇట్లాంటి ఒప్పందాలపై సంతకాలు చేయడం లేదని అన్నారు.

“భారతదేశం–అమెరికా మధ్య వాణిజ్యం మెరుగుపడుతోంది. మేం ఇండో–-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్​) నుండి వైదొలగడం నిజమే కానీ దాని తలుపులను పూర్తిగా మూసివేయలేదు. ప్రస్తుతం ఒప్పందం అమల్లో లేదు. చర్చలు జరుగుతున్నాయి. గణనీయమైన ప్రయోజనం పొందగలమని భావిస్తే దానిలో చేరే ప్రతిపాదనను పరిశీలిస్తాం. భారత్ తన సొంత నిబంధనల ప్రకారం ఒప్పందాలపై సంతకం చేస్తుంది. యూఎస్​ ఆర్థికమంత్రి జానెట్ యెల్లెన్ ఫ్రెండ్ షోరింగ్ (మిత్రదేశాల మధ్య వాణిజ్యం పెంచడం) గురించి మాట్లాడారు. వాళ్లు మనతో వాణిజ్యాన్ని పెంచాలని కోరుకుంటున్నారు  ఫ్రీ ట్రేడ్​ అగ్రిమెంట్ల కోసం భారతదేశంపై ఆసక్తి చూపిస్తున్నారు. గల్ఫ్ , యూరప్​ సహా ఎన్నో దేశాలు మనతో ఫ్రీ ట్రేడ్​ అగ్రిమెంట్లని కోరుకుంటున్నాయి. ప్రస్తుతానికి అన్ని  అగ్రిమెంట్లను కుదుర్చుకోవడం   వీలుకాదు”అని పీయూష్​ గోయల్​ వివరించారు.

గతంలో కుదుర్చుకున్న ఫ్రీట్రేడ్​ అగ్రిమెంట్లు మనకు అనుకూలంగా లేవు. అందుకే వీటి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే అమెరికా సహా ఏ ఇతర దేశంతోనూ ఇట్లాంటి ఒప్పందాలను కుదుర్చుకోవడం లేదు. ఏ ఒప్పందం అయినా మనకు లాభదాయకంగా ఉంటేనే సంతకం చేస్తాం. గ్లోబల్​ మార్కెట్లలో సమస్యలు ఉన్నప్పటికీ మన ఎగుమతులు ఈసారి కచ్చితంగా పెరుగుతాయి.

 ‑ కేంద్రమంత్రిపీయూష్​ గోయల్​