ఉద్యోగులకు కాగ్నిజెంట్ మరో షాక్

ఉద్యోగులకు కాగ్నిజెంట్ మరో షాక్

మ్యాక్సి మమ్ బెంచ్ టైమ్‌ తగ్గింపు
60 రోజుల నుంచి 35 రోజులకు కుదింపు

టెకీలకు కాగ్నిజెంట్ మరోసారి షాకిచ్చింది. ఇప్పటికే భారీగా ఉద్యోగాల కోత ప్రకటన చేసిన కాగ్నిజెంట్.. తాజాగా బిల్లింగ్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లపై లేని ఉద్యోగుల మ్యాక్సిమమ్ బెంచ్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ను తగ్గించింది. అంటే వచ్చే కొన్ని నెలల్లో మరింత మంది ఉద్యోగులు కంపెనీని వీడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బిల్లింగ్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లపై లేని ఉద్యోగుల బెంచ్ టైమ్‌‌‌‌‌‌‌‌ను  60 రోజుల నుంచి 35 రోజులకు తగ్గించింది. 35 రోజుల తర్వాత, వారిని కంపెనీని వీడాలని ఆదేశించే అవకాశం ఉంది. అధికారికంగా వారిని బయటకు పంపేందుకు మరో 60 నుంచి 90 రోజులు పడుతుంది. ఇప్పటికే ఉద్యోగాల కోత ప్రకటనతో, ఎంప్లాయీస్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా బెంచ్ టైమ్‌‌‌‌‌‌‌‌ను తగ్గించడంతో, ఉద్యోగులపై మరింత ఒత్తిడి పెరిగింది. అంతకుముందు బిల్లింగ్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లపై లేని ఉద్యోగులు తమ బిజినెస్ యూనిట్లలో లేదా కంపెనీలోనే వేరే ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లను వెతుక్కోవడానికి మరింత గ్రేస్‌‌‌‌‌‌‌‌ పీరియడ్‌‌‌‌‌‌‌‌ ఉండేది. వేరే నగరానికి మారేందుకు ఇష్టపడని లేదా వేరే ఫంక్షన్స్‌‌‌‌‌‌‌‌కు మారని ఉద్యోగులపై అంతకుముందు వేటు పడేది. కానీ ఇప్పుడు గ్రేస్ టైమ్‌‌‌‌‌‌‌‌ను మరింత తగ్గించి, ఉద్యోగులను కంపెనీ నుంచి గెంటేసే ప్రక్రియకు కాగ్నిజెంట్ తెరతీసింది. కంపెనీ గ్రోత్ స్ట్రాటజీలో ఇది ఒక భాగమని కాగ్నిజెంట్ చెబుతోంది. బెంచ్‌‌‌‌‌‌‌‌పై ఉన్న వారికి ఎక్కువ సమయం ఇవ్వకుండా.. త్వరగా వారు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునేలా ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొస్తోంది.

5 వేల మందికి రీస్కిల్లింగ్‌‌‌‌‌‌‌‌..

మారుతున్న క్లయింట్స్ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులను తీర్చిదిద్దాలని చూస్తోంది. చాలా ఏళ్ల పాటు రెండంకెల సంఖ్యలో వృద్ధిని నమోదు చేసిన కాగ్నిజెంట్, ఇటీవల సింగిల్ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితమైంది. వచ్చే కొన్ని నెలల్లో 13 వేల మందిని తీసేయనున్నట్టు కాగ్నిజెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవేళ వీరిలో కొంతమంది ఇతర విభాగాల్లో ఫిట్‌‌‌‌‌‌‌‌ అయితే 5 వేల మందికి రీస్కిల్లింగ్‌‌‌‌‌‌‌‌ చేపట్టనున్నట్టు తెలిపింది. కంపెనీలో ఎక్కువ లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌ ఇండియాలోనే ఉండబోతున్నాయి.