హైదరాబాద్, వెలుగు: కరోనా లాక్‌డౌన్ సమయంలో ఫోన్‌పే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు దూసుకెళ్లింది. ఏప్రిల్‌లో బాగా తగ్గినా, ఆ తర్వాత రికార్డు లెవెల్‌లో పెరిగిన యూపీఐ ట్రాన్సాక్షన్స్‌తో ఫోన్‌పే కూడా ఎక్కువగానే లాభపడింది. కొత్త యూజర్లు పెరిగారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌కు ఊపు వచ్చింది. ఈ ఉత్సాహంతో ఫోన్ పే మరో రెండేళ్లలో లాభాల బాట పట్టి, 2023లో ఐపీఓకి వెళ్లాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఫోన్‌పే నేషనల్ సేల్స్ మేనేజర్ స్మితా హాంజీ ‘వెలుగు’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ…
కరోనా లాక్‌డౌన్ సమయంలో ఫోన్‌పే వ్యాపారం ఎలా ఉంది..?
లాక్‌డౌన్ కాలంలో డిజిటల్ పేమెంట్లు బాగా పెరిగాయి. ప్రజలు డిజిటల్ పేమెంట్లను ఎక్కువగా వాడుతున్నందున ఫోన్‌పే కొత్త యూజర్లు 50 శాతం మేర పెరిగారు. రీఛార్జ్‌లు, బిల్లు పేమెంట్లు లాంటి రంగాల్లో గణనీయమైన వృద్ధి కనిపించింది. రీఛార్జ్‌లు, డీటీహెచ్ సెగ్మెంట్ల లావాదేవీల్లో 50 శాతానికి పైగా పెరుగుదల ఉంది. యూజర్లు తమకోసమే కాకుండా.. తమ ఫ్యామిలీలోని సభ్యులకు, ఫ్రెండ్స్‌కు కూడా ఫోన్‌పే ద్వారా రీఛార్జ్ చేయడంతో, రోజువారీ వినియోగంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌కు మంచి ఊపు వచ్చింది.
కరోనా కారణంగా ఫోన్‌పేలో లేఆఫ్‌లు, జీతాల కోత ఏమైనా ఉన్నాయా..?
ఫోన్‌పేలో లేఆఫ్‌లు కానీ, జీతాల కోత కానీ ఏమీ లేదు. కరోనా లాక్‌డౌన్ ఎంత కాలం కొనసాగుతుందనే అనిశ్చితి మధ్య కూడా మా ఉద్యోగులకు మేము ఉద్యోగ భద్రతపై భరోసా ఇచ్చాం. ప్రతి ఉద్యోగి కూడా సాధ్యమైనంతగా మంచి ఫలితాలను అందించేందుకే కష్టపడ్డారు. లాక్‌డౌన్ టైంలో కొన్ని నిర్ణయాలను చాలా వేగంగా తీసుకున్నాం.
ఉద్యోగుల కోసం కంపెనీ తీసుకున్న భద్రతా చర్యలు ఏమిటి? ప్రత్యేకంగా ఏదైనా ఇన్సూరెన్స్ స్కీమ్స్ అందించారా?
ఫోన్‌పేలో 8500కి పైగా ఆఫ్‌లైన్ సేల్స్ టీమ్ ఉంది. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచే, క్షేత్ర స్థాయిలో పనిచేసే టీమ్‌తో సహా ఉద్యోగులందరకూ మేము ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. సంస్థలో పనిచేసే పదివేల మందికి పైగా ఉద్యోగులకు ముందుగానే వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రకటించాం. ఇంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించిన అతి తక్కువ కంపెనీల్లో మేమూ ఉన్నాం. ఈ కరోనా క్లిష్టసమయంలో మేము మా ఉద్యోగులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాం. ఉద్యోగుల సంక్షేమం కోసం నెలవారీ ప్రత్యేకంగా భద్రతా బడ్జెట్‌ను కూడా కేటాయించాం. ఉద్యోగులు బయటకు వెళ్లకుండా ఉండేందుకు కఠినమైన మార్గదర్శకాలు జారీ చేశాం. తరుచూ ఉద్యోగులతో ఇంటరాక్షన్స్‌ను జరుపుతున్నాం.
ఎంత మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు? ఈ మోడల్‌లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఫోన్‌పే అనేది పేమెంట్స్ కంపెనీ, సెన్సిటివ్ డేటా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఇంతకుముందు చెప్పినట్టు, మా ఆఫ్‌లైన్ సేల్స్ టీమ్‌తో సహా 10 వేల మందికి పైగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చాం. వారు లేదా వాళ్ల కుటుంబాలు రిస్క్‌లో ఉన్నా, సొంత వాహనం లేకపోయినా, మెయిన్ ఆఫీసుకు దగ్గర్లో వారు లేకున్నా.. ఆఫీసుకు రావొద్దని ఉద్యోగులకు చెబుతూనే ఉన్నాం. ఆఫీసులో ఉద్యోగుల సంఖ్యను 30 శాతం లేదా అంతకంటే తక్కువకే పరిమితం చేశాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కొత్త మోడల్‌కు మా ఉద్యోగులు త్వరగానే అలవాటు పడ్డారు. వాస్తవంగా సాధారణ రోజుల కన్నా ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు కాస్త అలసటకు గురి చేస్తుందని మేము మొదట్లో ఆందోళన చెందాం. ఉద్యోగులు తమ ఆఫీసు పని, వ్యక్తిగత జీవితం రెండూ బ్యాలెన్స్ చేసేలా చూశాం. ఈ పరిస్థితుల్లో డేటా ఇక ఎంతమాత్రమూ ఆఫీసుకే పరిమితం కాదు. ఇది భద్రతాపరమైన ముప్పులను, ప్రభావాలను కలుగజేయొచ్చు. అయినప్పటికీ ఇలాంటి సంక్షోభ సమయంలో మనం వ్యక్తులకే తొలి ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది. మేము అన్ని సందర్భాల్లోనూ తప్పనిసరిగా పాటించాల్సిన సమాచార భద్రతా ప్రోటోకాల్‌ను పాటిస్తున్నాం. డేటా సేఫ్టీకి ఏదైనా ముప్పు ఉన్నట్టు పసిగడితే, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే వాటిపై మా ఉద్యోగులకు మేము వెంటనే సమాచారం అందిస్తాం. భద్రతాపరమైన సమస్యను గుర్తించే విధానంపై ఉద్యోగులకు మేము క్లియర్ గైడ్‌లైన్స్ ఇచ్చాం.
మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ ఎంత మేర పెరిగాయి..?
మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ బాగానే పెరిగాయి. సగటు లావాదేవీల విలువ 80–100 శాతం పెరిగింది. డిజిటల్ పేమెంట్‌కు మర్చెంట్లతో పాటు కస్టమర్లు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
మర్చెంట్ల కోసం ఫోన్‌పే ఇటీవల కొన్ని స్పెషల్ ఫీచర్లు తీసుకొచ్చింది? అవేమిటి? ఎలా నడుస్తున్నాయి..?
లాక్‌డౌన్ కాలంలో ఏయే షాపులు తెరిచి ఉన్నాయి. ఏ షాపులు హోమ్ డెలివరీ చేస్తాయనే విషయాలను కస్టమర్లు తెలుసుకోవాలని కోరుకున్నాం. వారి సమస్యలను పరిష్కరించాలనుకున్నాం. ప్రస్తుతం ఏయే షాపులు పనిచేస్తున్నాయి(కరెంట్లీ ఆపరేషనల్), హోమ్ డెలివరీ, ఆఫర్లు ఏమున్నాయి అని తెలుపుతూ సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చాం. రోజువారీ మారుతున్న ఇన్ఫర్మేషన్‌కి అనుగుణంగా ఎప్పడికప్పుడు అప్‌డేట్ చేస్తున్నాం. ఎలాంటి క్యూఆర్ స్కానింగ్ చేయాల్సినవసరం లేకుండానే ఫోన్‌పే యాప్‌లో దూరం నుంచే పేమెంట్ చేసేలా వీలు కల్పించాం. ఇది ఇటు వర్తకులకు, యూజర్లకు ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్లు ప్రారంభించిన తర్వాత, మా కార్యకలాపాలు ‘స్టోర్స్’ పేజీలో మూడు రెట్లు పెరిగాయి. మా మొబైల్ అప్లికేషన్‌పై రోజువారీ ట్రాఫిక్ 5 శాతం వరకు పెరిగింది. అంతేకాక యూజర్లు, మర్చెంట్ల కోసం ఛాట్ సర్వీసులను ప్రవేశపెట్టాం. ఈ ఛాట్ సర్వీసులు కిరాణాలకు చాలా సాయపడుతున్నాయి. కస్టమర్లతో ఎప్పడికప్పుడు కమ్యూనికేట్ అవుతూ, ఆఫర్లను తెలియజేస్తున్నాయి.
ఫోన్‌పే సేల్స్ టీమ్ ఈ కరోనా సంక్షోభ టైమ్‌లో ఎలా పనిచేస్తోంది..? వారికి కంపెనీ నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉంది..?
ఆఫ్‌లైన్ సేల్స్ టీమ్‌తో తాము రోజూవారీ వర్చ్యువల్ మీటింగ్స్ నిర్వహించాం. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా ఎలాంటి రిస్క్‌లు లేకుండా ఉండేందుకు మా ఆఫ్‌లైన్ సేల్స్ టీం కోసం అన్ని రకాల హెల్త్ సేఫ్టీ చర్యలు పాటించాం. అవుట్‌లెట్లను సందర్శించే సమయంలో శానిటైజర్లు, చేతి గ్లోవ్స్‌లు, ఫేస్ మాస్క్‌లు వినియోగం తప్పనిసరి చేశాం. సామాజిక దూరం పాటించేలా ఆదేశాలు జారీ చేశాం. గెట్ టు గెదర్స్‌ను అనుమతించలేదు. ఆఫ్‌లైన్ అవుట్‌లెట్లకు వెళ్లే సమయాన్ని తగ్గించాం. హోమ్ డెలివరీ, ఛాట్ సేవలను కోరుకుంటున్న ఆఫ్‌లైన్ మర్చెంట్లు క్రమంగా పెరుగుతున్నారు.
యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇటీవల బాగా పెరుగుతున్నాయి.. తెలంగాణ, ఏపీల నుంచి ఎంత వ్యాపారం వస్తోంది..?
తెలంగాణ, ఏపీ లోనే కాక, దేశవ్యాప్తంగా మేము అతిపెద్ద డిజిటల్ పేమెంట్ సంస్థగా ఉన్నాం. దేశవ్యాప్తంగా జరిగే పేమెంట్లలో దాదాపు 25 శాతం ఈ రెండు రాష్ట్రాల నుంచే జరుగుతున్నాయి.
గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎంలతో ఫోన్‌పే పోటీపడుతోంది కదా! మీరెలా డిఫరెంట్?
ఇతర పోటీదారులతో పోలిస్తే మేము యూపీఐ ఆధారిత పేమెంట్లను ఎక్కువగా వాడుతున్నాం. 2016 ఆగస్ట్‌లో మేము మొదట్లో నాన్ బ్యాంకింగ్ యూపీఐ యాప్‌గా వచ్చాం. అప్పటి నుంచి అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పుడు 400 సిటీల్లో 21 కోట్ల మందికి పైగా యూజర్లు మా యాప్‌ను వాడుతున్నారు. ఈ ఏడాది 27.5 కోట్ల మంది యూజర్లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మరో 22 కోట్ల మంది యూజర్లను మరో రెండేళ్లలో చేరుకుంటాం. డిజిటల్ పేమెంట్లను అందించడానికి మర్చెంట్లకు క్యూఆర్‌ను మొదట ప్రవేశపెట్టింది ఫోన్‌పే సంస్థనే. యూజర్ల కోసం కూడా ఇనొవేటివ్ సొల్యూషన్స్ తీసుకొచ్చాం.
