Abu Dhabi T10 League: ఒకే ఓవర్లో 34 పరుగులు.. మెగా ఆక్షన్ ముందు దంచి కొడుతున్న ఇంగ్లాండ్ క్రికెటర్

టీ20 క్రికెట్ లో ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసం కొనసాగుతుంది. లీగ్ ఏదైనా ఈ ఇంగ్లీష్ క్రికెటర్ పరుగుల వరద పారిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటికే తనదైన హిట్టింగ్ తో తనను తాను నిరూపించుకున్న సాల్ట్ తాజాగా మరో సంచలన ఇన్నింగ్స్ తో వైరల్ అయ్యాడు. అబుదాబి T10 లీగ్ లో టీమ్ అబుదాబి తరపున  19 బంతుల్లో 6 సిక్సర్లు, 2 బౌండరీలతో 53 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సాల్ట్ 278.95 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం విశేషం. 

ఇదిలా ఉంటే అజ్మాన్ బోల్ట్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో సాల్ట్ ఒక్క ఓవర్ లోనే ఏకంగా 34 పరుగులు బాదాడు. గుల్బాదిన్ నైబ్‌ వేసిన ఐదో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన సాల్ట్.. మూడో బంతిని ఫోర్ బాదాడు. ఇక చివరి మూడు బంతులను సిక్సర్లుగా మలచి ఈ ఓవర్ లో 34 పరుగులు రాబట్టాడు. సాల్ట్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో 79 పరుగుల లక్ష్యాన్ని టీమ్ అబుదాబి కేవలం 5.4 ఓవర్లలో ఛేజ్ చేసింది. వెస్టిండీస్ పై ఇటీవలే టీ20 క్రికెట్ లో మూడు సెంచరీలు చేసి ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా  సాల్ట్ చరిత్ర సృష్టించాడు.

ఈ ఇన్నింగ్స్  తో సాల్ట్ కు ఐపీఎల్ లో మంచి డిమాండ్ ఏర్పడే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ మెగా ఆక్షన్ నవంబర్ 24,25 తేదీల్లో జరగనుంది. సాల్ట్ ప్రస్తుతం సూపర్ ఉండడంతో పాటు.. 2024 ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ తరపున అద్భుతంగా  రాణించాడు. ఇటీవలే కేకేఆర్ అతన్ని రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసింది. దీంతో అతనికి భారీ ధర పలికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.