సికింద్రాబాద్ నడిరోడ్డుపై పెట్రోల్ ట్యాంక్ పల్టీలు.. రోడ్డుపై నీళ్లులా పారుతున్న పెట్రోల్

హైదరాబాద్ జంట నగరాల్లోని సికింద్రాబాద్ ఏరియాలో ఘోర ప్రమాదం.. బంకుకు వెళుతున్న పెట్రోల్ ట్యాంకర్.. నడిరోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంతో అందరూ షాక్ అయ్యారు. 2024, డిసెంబర్ 16వ తేదీ సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన పెట్రోల్ ట్యాంకర్ అది. పెట్రోల్ నింపుకుని.. పెట్రోల్ బంకులో అన్ లోడ్ చేయటానికి వెళుతుంది. సికింద్రాబాద్ ఏరియా గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలుగడ్డ బావి చౌరస్తా దగ్గరకు రాగానే.. అదుపు తప్పిన పెట్రోల్ ట్యాంకర్.. రోడ్డుపై బోల్తా కొట్టింది.

ప్రమాదం జరిగిన వెంటనే.. ట్యాంకర్ లోని పెట్రోల్ లీక్ అయ్యింది. రోడ్డుపై నీళ్లులా ప్రవహించింది. వెంటనే అప్రమత్తం అయిన ట్రాఫిక్ పోలీసులు.. ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఏ మాత్రం చిన్న అగ్విరవ్వ అంటుకున్నా.. ఆ ఏరియాలో పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో అత్యవసర చర్యలు చేపట్టారు. వెంటనే జేసీబీలు, వాటర్ ట్యాంకర్లను ఆ ఏరియాకు తరలించారు. జేసీబీ సాయంతో.. ట్యాంకర్ ను నిలబెట్టారు. రోడ్డుపై నీళ్లను పోశారు.

Also Read:-మంచు ఫ్యామిలీలో బిగ్ ట్విస్ట్: జనసేనలోకి మనోజ్, మౌనిక..!

పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదంతో.. రోడ్డుపై నీళ్లులా ప్రవహిస్తున్న పెట్రోల్ ను నీళ్లతో కడుగుతున్నారు. వాహనాలు వెళ్లినా ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో.. ఆ ఏరియాలో వాహనాల రాకపోకలను నిలిపివేసి.. జాగ్రత్తలు పాటించారు పోలీసులు.