న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డీజిల్ ధరలు గత నాలుగు రోజుల్లో దాదాపు 50 పైసలు పెరిగాయి. వీటికి ఆయా రాష్ట్రాల పన్నులు, సుంకాలు కలుపుకుంటే పెంపు భారం మరింత ఎక్కువ ఉంటుంది. ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. మరోసారి పెట్రోషాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే కొన్ని నెలల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా.. తక్కువ పొగను విడుదల చేసేలా బీఎస్–6 స్టాండర్స్ ప్రకారం పెట్రోల్, డీజిల్‌ను తయారు చేయాలని ఉత్పత్తి కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి బీఎస్–6 స్టాండర్డ్స్ అమలవుతున్నాయి. సాధారణ పెట్రో ప్రొడక్టులతో పోలిస్తే బీఎస్–6 ప్రకారం ఇంధనాన్ని తయారు చేయడానికి ఆయిల్ కంపెనీలు మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ అదనపు ఖర్చు భారాన్ని సహజంగానే అవి ప్రజలకు నెడుతాయి. తమ ఇన్వెస్ట్‌మెంట్లను రాబట్టుకోవడానికి బీఎస్–6 ఇంధనంపై ప్రీమియం వసూలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ, ప్రైవేటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇది వరకే కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తోంది. ఇందుకు ప్రభుత్వం ఒప్పుకుంటే లీటరు పెట్రోల్‌పై 80 పైసలు, డీజిల్‌పై రూ.1.50 అదనంగా వసూలు చేస్తారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా పెట్రో ప్రొడక్టులకు డిమాండ్ పడిపోయింది. అందుకే కొన్ని వారాలుగా ధరలు దిగొస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ప్రీమియం చార్జిని వసూలు చేస్తే, ధరలు పెరుగుతాయి. అంటే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నా, మనదేశంలో మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఈ విషయమై ప్రైవేట్ ఆయిల్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మాట్లాడుతూ బీఎస్–6 ఫ్యూయల్ తయారీకి అయిన ఖర్చును రాబట్టుకోవడానికి అనుమతివ్వాలని ఇది వరకే పెట్రోలియం మంత్రిత్వశాఖను కోరినట్టు వెల్లడించారు. ఇందుకోసం ఒక ప్లాన్‌ను కూడా తయారు చేసి అందించామని, ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని వివరించారు.
