విజయవాడ: ఏపీలో ఆర్టీసీ విలీనంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆరు నెలల్లోపే ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తమ ప్రభుత్వంలో కసిని పెంచాయని అన్నారు నాని.
‘ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు, పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకో’ అంటూ తెలంగాణ ప్రతిపక్షాలు, ఆర్టీసీ జేఏసీ నేతలు అన్నారు. దీంతో అక్కడ కమిటీలు వేసినరు,, ఎన్నాళ్లకైతదో.. ఏమైతదో చూద్దాం.. అంటూ కేసీఆర్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
జగన్ మాటిచ్చారు.. కేసీఆర్ చెప్పినట్లు జరగదు
విజయవాడలోని ఆర్టీసీ ఆసుపత్రిలో పేషెంట్ల సహాయకుల కోసం టీడీపీ ఎంపీ కేశినేని నాని తన సొంత డబ్బుతో నిర్మించిన వసతి భవనాన్ని మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మంచి పరిణామమన్నారు. ఆ తర్వాత ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ రోగుల సహాయకుల కోసం వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు కేశినేని నానికి మంత్రి పేర్ని నాని అభినందనలు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ మాట ఇచ్చారని, అనుకున్న ప్రకారం ఆ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. కేసీఆర్ చెప్పినట్టుగా కాకుండా 6 నెలల్లోనే ప్రక్రియను పూర్తి చేసి, ఆర్టీసీని ప్రభుత్వ రవాణా సంస్థగా మారుస్తామని అన్నారు.

