ఓటింగ్​శాతం పెరిగింది.. గెలిచేది మేమే

  •     మూడు పార్టీల్లో అదే ధీమా
  •     నాగర్​ కర్నూల్​లో 70.89% పోలింగ్
  •     గద్వాల అసెంబ్లీ సెగ్మెంట్​లో అత్యధికంగా 76.67
  •     కొల్లాపూర్​లో అత్యల్పంగా​ 66.32 శాతం

నాగర్​ కర్నూల్, వెలుగు: నాగర్​కర్నూల్​పార్లమెంట్​స్థానానికి సోమవారం జరిగిన ఎన్నికల్లో  ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 70.89 శాతం పోలింగ్ నమోదైంది. 2019 మేలో జరిగిన పార్లమెంట్​ఎన్నికల (62.33శాతం)తో పోలిస్తే ఈసారి 8 శాతం పోలింగ్ పెరిగింది. గద్వాల అసెంబ్లీ సెగ్మెంట్​లో అత్యధికంగా 76.67, ఆ తర్వాత అలంపూర్​లో గరిష్ఠంగా 75.84 శాతం ఓట్లు పోలయ్యాయి. మైలారం మైనింగ్​ఇష్యూతో గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరిస్తే అధికారులు పట్టుబట్టి ఆరుగురితో ఓట్లేయించి ఎన్నికలు జరిగాయనిపించారు.

జోష్ పెంచిన పోలింగ్​ శాతం...

ఓటింగ్​శాతం పెరగడంతో మూడు ప్రధాన పార్టీల నాయకుల్లో గెలుపు ధీమా పెరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలో ఉండడం, ఆరు గ్యారంటీలు, రుణమాఫీ తదితర అంశాలు ఓటర్లపై కచ్చితంగా ప్రభావం చూపిస్తాయన్న భరోసాతో అధికార పార్టీ నేతలు ఉన్నారు. మంత్రి, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్​ చైర్మన్​లు, గ్రామస్థాయిలో పోలింగ్ బూత్​వరకు బలంగా ఉన్న నెట్​వర్క్​తో పోల్​మేనేజ్​మెంట్ లో సక్సెస్​ అయ్యామని లెక్కలేసుకుంటున్నారు. ప్రచారంలో స్టార్టింగ్​ట్రబుల్​ఎదురైనా నామినేషన్ల విత్​డ్రా తర్వాత కల్వకుర్తి, నాగర్​ కర్నూల్, గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో ప్రచారంలో పుంజుకున్నామని చెబుతున్నారు. కాంగ్రెస్​ ప్రచారంలో అచ్చంపేట, కొల్లాపూర్​నియోజకవర్గాలు టాప్​లో ఉండగా ఆ తర్వాత స్థానంలో వనపర్తి ఉంది.

 బీఆర్ఎస్​ అభ్యర్థి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​కు పార్టీ మాజీలు, క్యాడర్​నుంచి ఆశించిన స్థాయిలో సపోర్ట్​ దొరకలేదన్న టాక్​ ఉంది. బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు ఉన్న గద్వాల, అలంపూర్​నియోజకవర్గాల్లో కూడా స్థానిక నేతల పనితీరు, ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపించలేదన్న కామెంట్స్​ వినిపించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకే పడుతుందన్న ధీమాతో ఉన్న కారు నేతలకు పోలింగ్​ ట్రెండ్స్​నిరాశ కలిగించాయని సమాచారం. బీఆర్ఎస్​నేతలు ఊహించని స్థాయిలో ఓట్ల బదిలీ జరిగిందన్న ప్రచారం జరిగింది. 

లీడర్లు, క్యాడర్​లేని బీజేపీ నుంచి అభ్యర్థిగా పోటీలోకి దిగిన భరత్​ప్రసాద్​పోలింగ్​తేదీ నాటికి అనూహ్యంగా పుంజుకున్నారనే వార్తలు వచ్చాయి. అభ్యర్థి ఎవరన్నది చూడకుండా మోదీ పేరుతో అర్బన్​ ఓటర్లు బీజేపీకి మద్దతుగా నిలిచారని ఫ్లాష్​ సర్వేల్లో బయటపడింది. గ్రామీణా ప్రాంతాల్లో పోలింగ్​ దీనికి పూర్తి విరుద్ధంగా సాగింది. మైనార్టీలు, దళిత సామాజిక వర్గాల్లోని మెజార్టీ ప్రజలు కాంగ్రెస్​ సైడ్​ తీసుకున్నారని సమాచారం. గతంలో కాంగ్రెస్​, బీఆర్ఎస్ పార్టీలకు బలమైన సాంప్రదాయ ఓటు బ్యాంక్​  ఉండేది. ఈ ఎన్నికలలో బీజేపీ తనకంటూ ఓటు​ బ్యాంక్​ తయారు చేసుకోగలిగిందని సమాచారం. 

మరోవైపు నామినేషన్ల నుంచి పోలింగ్​వరకు జరిగిన రోడ్డు షోలు, కార్నర్​ మీటింగ్స్​కు హాజరైన జనాలు, పంచిన నజరానాలలో భూమికి ఆకాశానికి తేడా ఉందన్న అంశం మూడు పార్టీల అభ్యర్థులకు అర్థమైంది. పోలింగ్​కు ముందు ఇచ్చిన మద్యం​కూడా పూర్తిస్థాయిలో కాకపోయిన కనీసం సగమైనా చేరితే బాగుండేదని ఓ క్యాండిడేట్​కామెంట్​ చేయడం గమనార్హం.