‘నమ్ముకొని అధికారం ఇస్తే, నమ్మకము పోగొట్టుకుంటివి. పదవి అధికారం బూని, పదిలముగా తల బోడిజేస్తివి. దాపునకు రాననుచు చనువుగా, టోపీ పెడితివి లాభపడితివి’ ప్రజాకవి కాళోజీ చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ నేతలకు సరిగ్గా సరిపోతాయి. తెలంగాణ సెంటిమెంట్, భావోద్వేగాలతో పదేండ్లు అధికారం వెలగబెట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతిపాలు చేసిన బీఆర్ఎస్ను ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఛీకొట్టినా, లోక్‌సభ ఎన్నికల్లో భూస్థాపితం చేసినా ఆ పార్టీలో మార్పురాలేదు.
గత పదేండ్లు ప్రజలు నమ్మి బీఆర్ఎస్కు అధికారం కట్టబడితే, ఆయన వారి విశ్వాసాన్ని వమ్ము చేస్తూ గడీల పాలనతో ఫాంహౌస్‌కే పరిమితమై, అంతులేని అవినీతికి పాల్పడి ప్రజల నెత్తిన టోపీ పెట్టారు. ప్రజలను మోసం చేసి సొంత ఎజెండాతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, అస్తిత్వాన్ని కాలరాశారు.
తెలంగాణలో రెండు దఫాల కేసీఆర్ పాలనతో విసిగిపోయిన ప్రజలు.. తెలంగాణ కోసం కొట్లాడింది సబ్బండ వర్గాలు, రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అని విశ్వసించి కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పాలనలో జరిగిన పలు తప్పిదాలను సరిదిద్దుతోంది. దీన్ని సహించలేని బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతూ ప్రతి అంశాన్ని వివాఋదాస్పదం చేయడానికి ప్రయత్నిస్తోంది.
సంస్కృతి, సంప్రదాయాలకు నెలవైన తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ఈ ప్రాంత అస్తిత్వానికి పెద్దపీట వేస్తారని ప్రజలు ఆశిస్తే కేసీఆర్ వాటికి తిలోదకాలిచ్చారు. సబ్బండ వర్గాలు పాల్గొన్న తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు కీలకపాత్ర పోషించగా కేసీఆర్ కుటుంబం కబంధ హస్తాల పాలనలో వారికి కనీసం అపాయింట్‌మెంట్‌కూడా లభించని దుస్థితి ఏర్పడింది.
తెలంగాణ అస్తిత్వానికి కేసీఆర్ తిలోదకాలు
దశాబ్ది పాలనలో తెలంగాణ పేరులోని అక్షరాలు, విగ్రహం, ఆట, పాట, గేయం ఇలా అన్నింటా అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లూ అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. ఎందుకు ఏర్పాటు చేయలేదో వారి వద్ద సమాధానం ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే విగ్రహ రూపురేఖలపై బీఆర్ఎస్ గగ్గోలు పెట్టడం శోచనీయం. తెలంగాణ తల్లి చీరకట్టు, ముఖకవళికలపై వ్యాఖ్యలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం.
వితండ వాదం
బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిందే అసలైన తెలంగాణ తల్లి విగ్రహమని వాదిస్తున్న ఆ పార్టీ వారు పదేండ్లలో అధికారికంగా విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? ప్రభుత్వం విగ్రహాన్ని రూపొందించేటప్పుడు ఇతర పార్టీలను సంప్రదించలేదని, అభిప్రాయాలను తీసుకోలేదంటున్నారు. గతంలో వీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినప్పుడు పార్టీలను, ప్రజా సంఘాలను ఆహ్వానించి వారి అభిప్రాయాలను సేకరించారా? బీఆర్ఎస్ రూపొందించిన విగ్రహంలో రాచరికం కనిపిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంలో మన సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర ఉట్టిపడుతున్నాయి.
సబ్బండ వర్గాల సాక్షిగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
సబ్బండ వర్గాల సాక్షిగా రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న అధికారికంగా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం మన అస్తిత్వానికి నిదర్శనంగా నిలిచింది. సకలజనుల్లో ఐక్యత, శక్తినిచ్చి, చైతన్యం కలిగించి, స్ఫూర్తినిచ్చే తల్లిగా ఉంది. తెలంగాణ తల్లి అంటే నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం. ప్రశాంత వదనంతో, సంప్రదాయ కట్టు బొట్టుతో, మెడకు కంఠె, పూసల హారం, కమ్మలు, గాజులు, కడియాలు, మెట్టెలు, ముక్కుపుడక, బంగారు ఆకుపచ్చ చీరతో ఐలమ్మ, సమ్మక్క సారమ్మ పోరాట స్ఫూర్తి ఈ విగ్రహంలో కనిపిస్తున్నాయి.
ఒక చేత్తో అభయం ఇస్తూ, మరోచేతిలో సంప్రదాయ పంటలను పట్టుకున్నట్టు విగ్రహం ఉంది. ఉద్యమాలు, బలిదానాల పోరాటాలకు సంకేతంగా విగ్రహం పీఠం, పిడికిళ్లను పొందుపరిచారు. కేసీఆర్ ఎవరినీ పట్టించుకోకుండా పాలన సాగిస్తే, అందుకు భిన్నంగా కాంగ్రెస్ ఎటువంటి భేషజాలకు పోకుండా, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలను సగౌరవంగా తెలంగాణ తల్లి ఆవిష్కరణకు ఆహ్వానించింది.
కేసీఆర్ పాలనలో దిగజారిన ప్రజల బతుకులు
రాచరిక వ్యవస్థకు ఆనవాలైన బీఆర్ఎస్ వారి తెలంగాణ తల్లి విగ్రహంలో కిరీటం ఉంటే, ప్రజాస్వామ్యానికి ప్రతినిధులైన కాంగ్రెస్ రూపొందించిన విగ్రహం సహజసిద్దమైన మాతృమూర్తిగా ఉంది.
బీఆర్ఎస్ వారి విగ్రహంలో ‘బతుకమ్మ’ ఉన్నా వారి పదేండ్ల పాలనలో ప్రజల బతుకులు బాగుపడలేదు కదా, మరింత దిగజారాయి. ‘బతుకమ్మ’ పండుగ, ‘తెలంగాణ జాగృతి’ పేరిట కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎంత బాగుపడ్డారో బహిరంగ రహస్యమే. రాష్ట్ర సంస్కృతిని సంప్రదాయాలను సొంత ప్రయోజనాలకు వాడుకున్న బీఆర్ఎస్ నిరంకుశత్వం, అవినీతి, అక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం బట్టబయలు చేస్తుంటే తట్టుకోలేని బీఆర్ఎస్ నేతలు నిరసనల పేరుతో రోడ్డెక్కుతున్నారు.
పదేండ్ల పాలనలో అందెశ్రీ గీతం వినిపించలేదెందుకు?
ఒక్క తెలంగాణ తల్లి విగ్రహం అంశంలోనే కాదు, బీఆర్ఎస్ ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలపై వివక్ష చూపిస్తూ, తెలంగాణ ఉద్యమకారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ వారికి అన్యాయం చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులను ఉర్రూతలూగించిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ గీతంపై బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లూ వివక్ష చూపించింది.
ఉద్యమ సమయంలో ఈ గేయాన్ని తమ స్వప్రయోజనాలకు వాడుకున్న బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే, గీత రచయిత అందెశ్రీపై వ్యక్తిగత కక్షగట్టి రాష్ట్రానికి పదేండ్లపాటు అధికారిక గీతం లేకుండా చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన దీన్ని అధికారిక గీతంగా ప్రకటించి, అందెశ్రీని ప్రభుత్వం గౌరవించడాన్ని ప్రజలు హర్షిస్తున్నారు.
గద్దర్‌ను అవమానించిన కేసీఆర్
ప్రజాయుద్ధ నౌక గద్దర్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నీరాజనాలు పడితే, సొంత రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ అహంకారం వల్ల అవమానాలకు గురయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ పాట అయిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా..’ పాట రాష్ట్రంలో వీధివీధినా వినిపించింది. అయితే, రాష్ట్ర సాధన తర్వాత అదే గద్దర్‌ను కేసీఆర్ సర్కార్ అవమానించారంటే అది ఆయనకు కాదు రాష్ట్రానికే అవమానం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాంక్ బండ్‌పై గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని, నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టాలనే చారిత్రాత్మక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. కళాకారులనే కాదు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాంను ‘నేను తయారు చేసిన లక్ష మందిలో వాడొకడు’ అని కేసీఆర్ అగౌరవపరిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు సరైన గుర్తింపు ఇచ్చి గౌరవించింది. వీరినే కాక ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ఆదుకోలేదు.
మరోవైపు ఉద్యమంలో తెలంగాణ అంటే ‘టీజీ’ అని ప్రాముఖ్యత ఉండగా, కేసీఆర్ తమ పార్టీ బీఆర్ఎస్ కు దగ్గరగా ఉండేలా దాన్ని ‘టీఎస్’ అని మార్చి వినియోగంలో పెడితే మేం దాన్ని తిరిగి ‘టీజీ’గా మార్చాం. కేసీఆర్ చేసిన తప్పులను, అన్యాయాలను కాంగ్రెస్ ఒక్కొక్కటి చక్కదిద్దుతుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక అసత్యాలను ప్రచారం చేస్తున్నారు.. కాంగ్రెస్ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతుంటే మాతృమూర్తి లాంటి తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ చేస్తున్న అసందర్భ వ్యాఖ్యలను ప్రజలు క్షమించరు.
- బి.మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ,టీపీసీసీ అధ్యక్షుడు-