హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అనుమతించిన ప్రాపర్టీలను మాత్రమే కొనాలని, లేకపోతే మోసపోయే అవకాశాలు ఉంటాయని కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) కస్టమర్లను హెచ్చరించింది. యుడీఎస్, ప్రీ లాంచ్, ప్రీ –సేల్స్ ప్రాపర్టీలను కొనుగోలు వల్ల కలిగే నష్టాల గురించి జనానికి అవగాహన కలిగించడానికి ‘బీ సేఫ్, బీ ష్యూర్’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించామని క్రెడాయ్, తెలంగాణా బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) తెలంగాణా డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ప్రకటించాయి. యుడీఎస్ ఆస్తులు, ప్రీ లాంచ్, ప్రీ సేల్స్ ప్రాపర్టీలకు రెరాతోపాటు హెచ్‌ఎండీఏ/జీహెచ్‌ఎంసీ అనుమతులు తప్పనిసరని తెలిపింది. బీ సేఫ్.. బీ ష్యూర్ ప్రచార కార్యక్రమాన్ని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పి. రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి టీబీఎఫ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు టీడీఏ ప్రెసిడెంట్ జీవీ రావు, డెవలపర్లు, అసోసియేషన్ల మెంబర్లు ప్రారంభించారు.
అందరూ ఒక్కతాటిపైకి..
అనధికార ప్రాపర్టీల లావాదేవీలను ఆపేందుకు తమ సంఘాలన్నీ కలసి పనిచేస్తున్నాయని రామకృష్ణా రావు అన్నారు. జనాన్ని మోసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. ‘‘అనుమతి లేని ప్రాపార్టీలు అమ్మే రియల్ ఎస్టేట్ కంపెనీలకు దూరంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను హెచ్చరించింది. ఈ తరహా కొనుగోళ్లు భవిష్యత్‌లో వివాదాలకు దారి తీయవచ్చు. ఎందుకంటే ఈ పాపర్టీలేవీ తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్–రెరా) వద్ద రిజిస్టర్ కాలేదు. కొంతమంది రియల్ ఎస్టేట్ ఆపరేటర్లు వ్యాపారంలో ఎలాంటి అనుభవమూ లేకుండానే వస్తున్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రాపర్టీలను అంటగడుతున్నారు. భూమిలో అన్‌డివైడెడ్ షేర్ చూపి ప్రీ సేల్/ప్రీ లాంచ్ అంటూ తమ ప్రాజెక్టులను హెచ్‌ఎండీఏ/జీహెచ్‌ఎంసీ అనుమతులు లేకుండానే అమ్ముతున్నారు. టీఎస్–రెరాలో ఇవి రిజిస్టర్ కావడం లేదు. యుడీఎస్ ప్రాపర్టీని అతి తక్కువ ధరలకు అందిస్తున్నామంటూ ఇన్వెస్టర్లను మోసం చేస్తున్నారు. వాళ్లు చెబుతున్న ధరల్లో ఆస్తులు అమ్మడం అసాధ్యం. ఇట్లాంటి ప్రాజెక్టులు ఎన్నటికీ పూర్తి కావు. ఇలాంటి వాళ్లు అమ్మకాలతో వచ్చిన డబ్బును ఇతర పనుల కోసం వాడుతున్నారు. కొన్నిసార్లు ఈ ప్రాజెక్టులు అసలు ప్రారంభం కావు లేదా చట్టపరమైన సమస్యలు రావడం వల్ల నిలిచిపోతాయి. ఈ తరహా మోసపూరిత వ్యాపారులను కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదు’’ అని స్పష్టం చేశారు. ఏదైనా ప్రాజెక్ట్ టీఎస్–రెరాలో రిజిస్టర్ అయితేనే అన్ని రకాల అనుమతులూ దానికి ఉన్నాయని అర్థమని చెప్పారు. రెరా రూల్స్ ప్రకారం రియల్టర్ ఒక ఎస్ర్కో ఖాతాను తెరిచి, ప్రాజెక్ట్ కోసం నిధులను ఆ ఖాతాలో డిపాజిట్ చేయాలి. నిధులను వేరే పనుల కోసం మళ్లించకూడదు. తద్వారా ప్రాజెక్ట్ నిర్మాణం అనుకున్న టైమ్‌లో పూర్తవుతుంది.
ప్రభుత్వం కఠినంగా ఉండాలి
‘‘రియల్ ఎస్టేట్ రంగంలో అనారోగ్యకరమైన, ప్రమాదకరమైన పోకడలను ప్రభుత్వం సహించకూడదు. అక్రమాలపై తగు చర్యలను తీసుకోవాలని కోరుతున్నాం. ఇందుకోసం రెరా అథారిటీకి మరిన్ని అధికారాలు ఇవ్వాలి. నేరం చేసిన వారికి అత్యంత కఠినమైన శిక్షలు విధించేలా చూడాలి. కష్టపడి పోగు చేసుకున్న డబ్బును జనం నష్టపోకుండా చూడాలి. లేకపోతే హైదరాబాద్ పేరు దెబ్బతింటుంది’’ అని క్రెడాయ్ తెలంగాణ ఛైర్మన్ రామచంద్రా రెడ్డి అన్నారు. ‘‘ హైదరాబాద్ తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా ఎదుగుతోంది. కరోనా తరువాత కూడా మిగతా నగరాలతో పోలిస్తే మన సిటీ మరింత దూకుడుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చక్కటి విధానాలు దీనికి కారణం. ఈ పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని కొందరు రియల్టర్లు ప్రీ సేల్స్, ప్రీ లాంచ్ పేరిట ప్లాట్స్/ఫ్లాట్స్‌ను అంటగడుతున్నారు. రెరా రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టులలో కొనుగోళ్లు చాలా ప్రమాదకరం. రిజిస్ట్రేషన్ లేకుంటే ఆ ప్రాజెక్టులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టం. పెట్టుబడికి భద్రత ఉండదు. అక్రమ ఆస్తుల అమ్మకాలను అడ్డుకోవడానికి కొత్త రూల్స్‌ను తీసుకురావాలి’’ అని అన్నారు.
