ఏపీలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. పోలింగ్ తేదీ 40రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేసి జనాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రచారానికి వెళ్లిన వైసీపీ కీలక నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావుకు జనాలు ఊహించని షాక్ ఇచ్చారు. శ్రీకాకుళంలో ఇంటింటి ప్రచారానికి వెళ్లిన ధర్మాన ఓటు ఎవరికీ వేస్తారని కొంతమందిని అడగగా చంద్రబాబుకు వేస్తామని చెప్పారు. వారిని వైసీపీ గుర్తు ఏంటని ధర్మాన అడగగా కొంతమంది సైకిల్ అని, ఇంకొంత మంది హస్తం గుర్తు అని బదులిచ్చి షాక్ ఇచ్చారు.
ఈ క్రమంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ గుర్తును జనాల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. ఇంతమంది సైనికులం ఉండి కూడా పార్టీ గుర్తు కూడా జనాలకు తేలికపోవటం దారుణమని అన్నారు. ఫ్యాను గుర్తును బలంగా జనాల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు ధర్మాన. ఒక రాష్ట్ర మంత్రి తన సొంత నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావటం దారుణమని చెప్పాలి.