వనపర్తి జిల్లాలో కబ్జాదారులను అడ్డుకున్న ప్రజలు

  • పెబ్బేరు సంత స్థలాన్ని చదును చేసేందుకు వచ్చిన రియల్టర్
  • ఆందోళనకు దిగడంతో అనుచరులతో కలిసి పరార్

పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా పెబ్బేరులో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన సంత భూమిలో ఓ రియల్​ వ్యాపారి తన బలగంతో హద్దులు ఏర్పాటు చేయాలని చూడగా గ్రామస్తులు, సంత కాంట్రాక్టర్లు, పరిరక్షణ సమితి సభ్యులు అడ్డుకున్నారు. నీలం గౌడ్​ అనే రియల్టర్​​సంత స్థలం తనదంటూ కొందరు గూండాలను వెంట తెచ్చుకొని శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో హద్దు రాళ్లు పాతేందుకు సిద్ధమయ్యాడు. జేసీబీలు, హిటాచీలు, టిప్పర్లు తెచ్చుకున్నారు. సంత బాటకు ఒక పక్కన కంకర పోశారు.

ఇదంతా గమనించిన ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు, కాంట్రాక్టర్లు, వివిధ పార్టీల నాయకులు అక్కడికి చేరుకొని పనులను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రియల్టర్​​తన వెంట తెచ్చుకున్న వారిని ఉసిగొలపడంతో కొంత సేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. రాళ్లతో దాడి చేసుకున్నారు. గొడవ పెద్దదవుతుందని గ్రహించిన రియల్టర్​​అక్కడి నుంచి తన వాహనంలో పరారయ్యాడు. అనంతరం గ్రామస్తులు పెబ్బేరు సుభాశ్​​చౌరస్తాలో ధర్నా చేసి, పీఎస్​లో కంప్లైంట్​ ఇచ్చారు. దేవుడి భూమి దేవుడికే చెందాలని, ఇతరులు వచ్చి దానిని కబ్జా చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రియల్టర్​పై చర్యలు తీసుకొని, సంత స్థలానికి శాశ్వత పరిష్కారం చూపాలనికోరారు.