ల‌క్ష్యానికి చేరుకోని రూ.3000 పెన్ష‌న్ స్కీమ్‌

ల‌క్ష్యానికి చేరుకోని రూ.3000 పెన్ష‌న్ స్కీమ్‌
ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్ ధన్-PMSYM.. దేశంలో త‌క్కువ వేత‌నం పొందుతున్న అసంఘటిత రంగ కార్మికులకు కేంద్రం అందించిన సోష‌ల్ సెక్యూరిటీ స్కీమ్‌. 2019 ఫిబ్ర‌వ‌రిలో అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే ల‌క్ష్యంగా ఈ స్కీమ్ ప్రారంభ‌మైంది. అసంఘటిత రంగంలో పనిచేస్తూ రూ.15,000 లోపు వేతనం పొందుతున్నవారు ఎవరైనా ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరేలా ప్ర‌భుత్వం ప్రోత్స‌హించింది. ప్రతీ ఏటా 2 కోట్ల చొప్పున ఐదేళ్లలో 10 కోట్ల మందిని ఈ స్కీమ్‌లో చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రెండేళ్లలో కేవలం 44 లక్షల మంది మాత్రమే.. అంటే ఏటా 22 లక్షల మంది మాత్రమే చేరారు.దేశం మొత్త‌మ్మీద‌ 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉండ‌గా.. వారిలో ఇప్పటివరకు కేవలం 1 శాతం మంది మాత్రమే ఈ పథకంలో చేరిన‌ట్టు తెల‌స్తోంది. ఈ పథకం గురించి అవగాహన లేకపోవడం వల్లే సబ్‌స్క్రైబర్లు తక్కువగా చేరుతున్నారని నిపుణులు భావిస్తున్నారు.అసంఘటిత రంగంలో పనిచేస్తూ రూ.15,000 లోపు వేతనం పొందుతున్నవారు ఎవరైనా ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరొచ్చ‌ని అధికారులు చెబుతున్నారు. ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరాలంటే లబ్ధిదారులకు ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి, ప్రతీ నెల కొంత మొత్తం ఈ స్కీమ్‌కు చెల్లించాల్సి ఉంటుంది. వయస్సును బట్టి జమ చేయాల్సిన మొత్తం మారుతుంది. కనీసం రూ.55 నుంచి రూ.200 మధ్య చెల్లించాలి. లబ్ధిదారులు ఎంత జమ చేస్తే ప్రభుత్వం కూడా వారి అకౌంట్‌లో అంతే మొత్తం జమ చేస్తుంది. లబ్ధిదారులకు 60 ఏళ్ల నుంచి జీవితాంతం నెలకు రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. లబ్ధిదారులు మరణిస్తే వారి జీవితభాగస్వామికి జీవితాంతం సగం పెన్షన్ లభిస్తుంది.